-

50% ఓబీసీ కోటాకు నో

27 Oct, 2020 03:07 IST|Sakshi

వైద్య సీట్లపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీలకు ఈ విద్యా సంవత్సరం నుంచే 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమ రాష్ట్రంలోని వైద్య విద్యా సంస్థల గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్, డెంటల్‌ కోర్సులకు ఆల్‌ ఇండియా కోటాలో ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్‌ను 2020–21 విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం, అక్కడి అధికార పార్టీ ఏఐఏడీఎంకే పెట్టుకున్న అర్జీలపై సోమవారం జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది.

తమిళనాడు రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు జూలై 27వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే, రిజర్వేషన్ల అమలు విధానపరమైన అంశం అయినందున కేంద్రానికి తగు ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన మద్రాస్‌ హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషనర్లు సవాల్‌ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఓబీసీ కోటా అమలు చేయాలనే విషయంలో కూడా మద్రాస్‌ హైకోర్టు ఒక స్పష్టత ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 50 శాతం కోటా అమలు ఆచరణలో సాధ్యం కాదని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం తమిళనాడు పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది.

మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం స్టే
అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారాన్ని భౌతికంగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించుకోవచ్చని రాజకీయ పార్టీలకు సూచిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చట్ట నిబంధనల ప్రకారం ఎన్నికల ర్యాలీలపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల ›సంఘానికి సూచించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎ.ఎం.ఖన్వీల్కర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు రాలేదన్న విషయాన్ని మధ్యప్రదేశ్‌ హైకోర్టు గుర్తించాలని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికల విషయంలో అన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తున్నామని ఎన్నికల సంఘం ధర్మాసనానికి తెలిపింది. మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 3వ తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతోనే ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భవితవ్యం తేలిపోనుంది.

మరిన్ని వార్తలు