పోలీస్‌– పొలిటీషియన్‌ దోస్తీ.. నయా ట్రెండ్‌!

28 Sep, 2021 04:59 IST|Sakshi

తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు 

అలాంటి అధికారులను ఎందుకు రక్షించాలని ప్రశ్న

న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న రాజకీయనేతలతో పోలీసు అధికారులు దోస్తీ చేయడం దేశంలో కొత్త ట్రెండ్‌గా మారిందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన అధికారులపై వచ్చే క్రిమినల్‌ కేసుల నుంచి తామెందుకు రక్షించాలని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ ప్రశ్నించింది. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు.

అనంతరం పోలీసు అకాడమీ డైరెక్టర్‌ (అదనపు డీజీపీ హోదా)గా నియమితులయ్యారు. ప్రభుత్వం మారిన అనంతరం అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసుల కారణంగా గుర్జీందర్‌ పాల్‌ సస్పెండయ్యారు. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాని రాజద్రోహం కేసు కూడా నమోదయింది. రాజద్రోహం కేసును కొట్టివేయాలంటూ తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు సింగ్‌పై తీవ్ర చర్యలను కొన్నాళ్లు ఆపాలని, సింగ్‌ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సింగ్‌ న్యాయ

వాదిని ఉద్దేశించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పదవిలో ఉన్నవారితో అతి సాన్నిహిత్యం వల్ల ఇలాగే జరుగుతుందని, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని చురకలంటించింది. ఇలాంటివారిని ఎందుకు రక్షించాలని, తను జైలుకు వెళ్లాల్సిందని బెంచ్‌ తీవ్రవ్యాఖ్యలు చేసింది. సింగ్‌ కింది కోర్టులో లొంగిపోయి, తర్వాత బెయిల్‌కు యత్నించాలంది. సింగ్‌ లాంటి సిన్సియర్‌ అధికారులను కోర్టు రక్షించాలని న్యాయవాది కోరారు. సింగ్‌పై ఆరోపణలకు రుజువులున్నాయని రాష్ట్రప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 

మరిన్ని వార్తలు