మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు: సుప్రీం

10 Jan, 2023 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘మతమార్పిళ్లు చాలా సీరియస్‌ విషయం. దీనికి రాజకీయ రంగు పులమొద్దు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ఎం షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్‌ అని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ చేసిన వాదనను తీవ్రంగా తప్పుబట్టింది.

‘‘ఇలా వాదించేందుకు మీకు వేరే కారణాలుండొచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణను మరోలా మార్చుకునేందుకు ప్రయత్నించకండి. మీ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. దీన్ని రాజకీయం చేయకండి’’ అంటూ హితవు పలికింది. ఈ కేసులో అమికస్‌ క్యూరీగా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని కోరింది.  

మరిన్ని వార్తలు