ఉచితాలు, సంక్షేమ పథకాలు రెండు వేరు వేరు: సుప్రీం కోర్టు

11 Aug, 2022 16:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండు విభిన్న అంశాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్న డబ్బు, సంక్షేమ చర్యల మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వటాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అలా చేసే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసేలా ఆదేశాలనివ్వాలని కోరారు.

ఈ పిల్‌పై విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ క్రిష‍్ణ మురారీల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో నెరవేర్చలేని ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయటం అనేది అప్రజాస్వామికమని పేర్కొంది ధర్మాసనం. ‘రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అనే అంశంలోకి వెళ్లదలుచుకోలేదు. అది అప్రజాస్వామికమైన ఆలోచన. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయితే, ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వటం తీవ్రమైన అంశం. కానీ, చట్టపరమైన అడ్డుకట్ట పడేవరకు జోక్యం చేసుకోలేము.’ అని పేర్కొన్నారు సీజేఐ ఎన్‌వీ రమణ.

ఇప్పటికే పలువురు సీనియర్‌ న్యాయవాదులు పలు సూచనలు చేశారని, మిగిలిన వారు సైతం తన పదవీ విరమణలోపు సలహాలు ఇవ్వాలని కోరారు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ. ‘ ఉచితాలు, సంక్షేమ పథకాలు అనేవి వేరు వేరు. ఆర్థిక వ్యవస్థ నష్టం, ప్రజల సంక్షేమం మధ్య సమతుల్యత అవసరం. అందుకే ఈ చర్చ. ఆ దిశగా ఆలోచనలు, సూచనలను నా రిటైర్‌మెంట్‌లోపు చెప్పండి.’ అని పేర్కొన్నారు.  తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు.

ఇదీ చదవండి: స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు

మరిన్ని వార్తలు