ప్రేక్షక పాత్ర పోషించలేం: సుప్రీంకోర్టు

28 Apr, 2021 11:03 IST|Sakshi

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు 

ధరలకు ప్రాతిపదిక ఏమిటి? 

హేతుబద్ధతను వివరించండి 

కరోనా జాతీయ సంక్షోభం 

మౌన ప్రేక్షకపాత్ర పోషించలేం  

అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ  

మెడికల్‌ ఆక్సిజన్‌ అపరిమితంగా ఎక్కడా ఉండదు: కేంద్రం

న్యూఢిల్లీ:   దేశంలో అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న కరోనా కేసుల్ని జాతీయ సంక్షోభంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఇలాంటి వేళలో తాము మౌన ప్రేక్షకపాత్ర పోషించలేమని స్పష్టం చేసింది. జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్ర భట్‌ల ధర్మాసనం యావత్‌ భారత దేశం జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు తాము స్పందించకుండా ఉండలేమని మంగళవారం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా టీకా ధరలపైనా సుప్రీం దృష్టి సారించింది. కరోనా వ్యాక్సిన్‌ ధరల్లో వ్యత్యాసం ఎందుకు ఉందని కేంద్రాన్ని ప్రశ్నించింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆస్పత్రులకి వేర్వేరు ధరలకు వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. సీరమ్‌ రాష్ట్రాలకు రూ. 400లకు డోసు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600లకు డోసు చొప్పున అమ్ముతామని ప్రకటించింది.

కాగా భారత్‌ బయోటెక్‌ రాష్ట్రాలకు రూ.600, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,200 చార్జ్‌ చేస్తామని తెలిపింది. అయితే ఈ రెండు ఫార్మా సంస్థలు కేంద్రానికి మాత్రం రూ.150లకే డోసు చొప్పున సరఫరా చేస్తున్నాయి. ఇలా వేర్వేరు ధరలకు ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని, దీంట్లో హేతుబద్ధతను వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘ఇదో మహమ్మారి. జాతీయ విపత్తు. ఔషధ ధరల నియంత్రణకు కేందానికున్న అధికారాలను ఉపయోగించడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీ అధికారాలను ఉపయోగిస్తారు?’ అని కేంద్రాన్ని నిలదీసింది.  

మేము పోషించేది సహాయ పాత్ర  
కరోనా సంక్షోభాన్ని సుమోటోగా స్వీకరించడం అంటే, హైకోర్టు స్థాయిల్లో విచారణను అడ్డుకోవడం కాదని స్పష్టం చేసింది. ‘మేము పోషిస్తున్నది సహాయ పాత్ర. రాష్ట్రాల మధ్య వచ్చే అంశాలను పరిష్కరించడంలో హైకోర్టులకు ఇబ్బందులు ఎదురైతే , మేము సాయం చేస్తాం’అని వెల్లడించింది. గత గురువారం నాడు దేశంలో పరిస్థితుల్ని సూమోటోగా స్వీకరించి కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు లాయర్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కరోనా సంక్షోభంపై రాష్ట్రాల స్థాయిలో హైకోర్టులనే విచారించడానికి అనుమతించాలంటూ వారు సూచనలు చేశారు.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత వారం çసుమోటోగా స్వీకరించిన కేసునే మంగళవారం విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు ఆక్సిజన్‌ నిల్వలు, టీకా లభ్యత, రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ అవసరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అందించాలని ఆదేశించింది. మే 1 నుంచి 18 ఏళ్ల వయసు పై బడిన వారికి టీకా అందివ్వనున్న నేపథ్యంలో టీకా లభ్యత, దాని నిర్వహణ, ఆక్సిజన్‌ కొరతకి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం లోగా తమ నివేదికలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో అమీకస్‌ క్యూరీగా సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, మీనాక్షి అరోరాలను నియమించిన సుప్రీం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.  

  • ఆక్సిజన్‌ మొత్తం లభ్యతను కోర్టుకు తెలియజేయాలి. భవిష్యత్తులో ఆక్సిజన్‌ డిమాండ్‌ ఎంత ఉండనుంది, సరఫరా వృద్ధికి తీసుకొన్న చర్యలు, ప్రభావిత రాష్ట్రాలకు సరఫరా నిర్ధారణ, పర్యవేక్షణ విధానం తెలపాలి.  
  • రెమిడెసివిర్, ఇతరత్రా ఔషధాల సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలు. 
  • మే 1 నుంచి 18 ఏళ్ల దాటిన అందరికీ వ్యాక్సిన్‌ అగందిస్తామంటున్నారు. దీనిబట్టి ఎంత వ్యాక్సిన్‌ అవసరమనేది స్పష్టం చేయాలి.  
  • వ్యాక్సిన్‌ కొరత, లోటుపై కేంద్రం విజన్‌ తెలపాలి. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరాను పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. 

మెడికల్‌ ఆక్సిజన్‌ అపరిమితంగా ఎక్కడా ఉండదు: కేంద్రం
వైద్య అవసరాల కోసం వినియోగించే ఆక్సిజన్‌ ఏ దేశంలోనూ అపరిమితంగా నిల్వ చేయరని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ప్రధాని నిరంతర పర్యవేక్షణలో ఆక్సిజన్‌ డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచుకుంటూ వెళుతున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కోర్టులో 200 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కరోనా కేసులు తారస్థాయికి చేరుకున్న అసాధారణ స్థితిలో అందుబాటులో ఉన్న వనరుల్ని పూర్తిగా వినియోగిస్తూ ఆక్సిజన్‌ ఉత్పత్తిని మరింతగా పెంచామని తెలిపింది. స్థానికంగా మెడికల్‌ ఆక్సిజన్‌ అందుబాటులోకి రావడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని తెలిపింది. ఆక్సిజన్‌ కొరత తీర్చడంలో పక్కా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్ని జాతీయ స్థాయిలో ఆక్సిజన్‌ లభ్యత ఆధారంగా చూడాలని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు