Supreme Court of India: ఆలయ భూహక్కులు దేవుడివే

8 Sep, 2021 03:49 IST|Sakshi

పూజారి భూస్వామి కాలేడు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేవాలయ భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని, పూజారి ఎప్పటికీ భూస్వామి కాలేడని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దేవాలయ ఆస్తులుగా ఉన్న భూముల నిర్వహణ మాత్రమే పూజారిదని, భూములన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. భూమి హక్కులకు సంబంధించిన పత్రాలలో యజమాని అన్న కాలమ్‌లో ఆ ఆలయంలో కొలువు తీరిన దేవుడి పేరు రాయాలని, చట్టపరంగా దేవుడికే ఆ భూమిపై హక్కులుంటాయని న్యాయమూర్తులు చెప్పారు.

పూజారులు, దేవస్థానంలో ఇతర సిబ్బంది ఆ దేవతామూర్తి తరఫునే పనులు నిర్వహిస్తారని, పూజారి ఎన్నటికీ కౌలుదారుడు కాలేడని భూ చట్టాలలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో దేవాలయ భూముల్ని పూజారులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరోధిస్తూ రెవెన్యూ రికార్డుల నుంచి పూజారి పేరుని తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది.

ఆ సర్క్యులర్‌లను హైకోర్టు కొట్టివేయడంతో దానిని సవాల్‌ చేస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కింది. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్‌ దేవాలయ భూముల నిర్వహణ, పరిరక్షణ మాత్రమే పూజారి విధి అని ఒకవేళ తన విధుల్ని నిర్వర్తించడంలో విఫలమైతే మరొకరికి అప్పగించే అవకాశాలు ఉండడం వల్ల ఆయనను భూస్వామిగా చెప్పలేమంది. రెవెన్యూ రికార్డుల్లో పూజారి, మేనేజర్ల పేర్లు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు