సెక్స్‌ వర్కర్లు మనుషులే.. పోలీసులకు, మీడియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు

26 May, 2022 08:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘సెక్స్‌ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. మనుషుల మర్యాదకు కనీస భద్రత కల్పించడం బాధ్యతగా గుర్తించాలని పేర్కొంది. సెక్స్‌ వర్కర్లకు గౌరవం, భద్రత కల్పించడానికి చట్టమేదీ లేదు. అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని పేర్కొంది.

సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గావై, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్‌ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. వేధించడం, దూషించడం గానీ, భౌతికంగా గానీ సెక్స్‌వర్కర్ల మీద దాడి చేసే హక్కు గానీ పోలీసులకు ఉండబోదని కోర్టు పేర్కొంది. సె‍క్స్‌ వర్కర్ల పనిని ‘‘వృత్తి’’గా గుర్తించే ముఖ్యమైన క్రమంలో..  చట్టం ప్రకారం గౌరవం, సమాన రక్షణకు సెక్స్‌ వర్కర్లు అర్హులని వ్యాఖ్యానించింది.

అలాగే సెక్స్‌ వర్కర్లను వ్యభిచార కూపం నుంచి రక్షించే సమయంలో.. సెక్స్‌వర్కర్ల ఫొటోలు, గుర్తింపును బయటపెట్టొద్దంటూ కోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చసింది. ఐపీసీ సెక్షన్‌ 354సీ voyeurism (ఇతరులు నగ్నంగా ఉన్నప్పుడు.. శారీరకంగా కలుసుకున్నప్పుడు తొంగి చూడడం లాంటి నేరం) కిందకే వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మీడియాకు జారీ చేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది.

మరిన్ని వార్తలు