మూడు నెలల్లో.. ముగ్గురు సీజేలు!

26 Apr, 2022 17:25 IST|Sakshi

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల స్వల్ప వ్యవధిలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతోంది. ఇద్దరు సీజేలు రిటైర్‌ కానుండటంతో ఈ అరుదైన సందర్భం రాబోతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 16తో ముగుస్తుంది. ఆయన తర్వాత జస్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్ నవంబర్ 8 వరకు దాదాపు రెండు నెలల పాటు సీజేగా కొనసాగుతారు. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్.. ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన రెండు సంవత్సరాల పాటు పదవీలో ఉంటారు. 

ఇంత తక్కువ వ్యవధిలో దేశం ముగ్గురు వేర్వేరు సీజేలను చూడటం ఇదే మొదటిసారి కానప్పటికీ.. ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలానికి సంబంధించిన సమస్య మరోసారి తెరమీదకు వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీకాలాన్ని కనీసం మూడేళ్లకు పెంచడంతోపాటు ప్రస్తుతం ఉన్న పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో ఇతర న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చేయబోతున్నందున సుప్రీంకోర్టులో మరిన్ని ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు.

న్యాయమూర్తుల పదవీకాలం తక్కువగా ఉండటం వల్ల పెండింగ్‌ కేసులు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఇప్పటికే 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా వచ్చిన సీజేలకు తగింత సమయం ఉండకపోవడంతో కొత్త మార్పులను సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రస్తుత వ్యవస్థను మరింత మెరుగ్గా నడిపించడానికి అవరసరమైన విధానాలను రూపొందించడానికి వీలు పడటం లేదు. 

చరిత్ర సృష్టించనున్న చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపట్టనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. తండ్రీకొడుకులు సీజేలు సేవలు అందించిన అరుదైన ఖ్యాతిని వారు దక్కించుకోనున్నారు. ఆయన తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్.. 1978, ఫిబ్రవరి నుంచి 1985, జూలై వరకు సీజేగా సేవలు అందించారు. (క్లిక్‌: రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్‌!)

రానున్న నెలల్లో భారీగా ఖాళీలు
సుప్రీంకోర్టులో ప్రస్తుతం రెండు న్యాయమూర్తుల పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రానున్న నెలల్లో ఈ ఖాళీల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జస్టిస్ వినీత్ శరణ్ మే 10న, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జూన్ 7న, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ జూలై 29న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు మహిళా న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఇందిరా బెనర్జీ సెప్టెంబర్ 23న రిటైర్‌ కానున్నారు. జస్టిస్ హేమంత్ గుప్తా అక్టోబర్ 16న పదవీ విరమణ చేయనున్నారు.


భారత్‌లోనే తక్కువ!

ఇతర దేశాల్లోని న్యాయమూర్తుల పదవీకాలంతో పోలిస్తే భారతీయ న్యాయమూర్తుల పదవీకాలం తక్కువ. జడ్జిల పదవీ విరమణ వయసు యూకేలో 75, కెనడాలో 70 సంవత్సరాలుగా ఉంది. ఆస్ట్రేలియా, బెల్జియం, నార్వే వంటి దేశాలల్లోనూ న్యాయమూర్తులు 70 సంవత్సరాల వయస్సు వరకు పని చేస్తారు. అమెరికా, రష్యా, న్యూజిలాండ్, ఐస్‌లాండ్ దేశాల్లో న్యాయమూర్తులు జీవితకాలం సేవలు అందించే అవకాశముంది. (క్లిక్‌: అంగన్‌వాడీలు గ్రాట్యుటీకి అర్హులే..)

మరిన్ని వార్తలు