బిట్‌కాయిన్‌ చట్ట విరుద్ధమా? కాదా?

26 Feb, 2022 04:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బిట్‌ కాయిన్‌ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్‌ బిట్‌కాయిన్‌ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్‌ భరద్వాజ్‌ వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్‌కాయిన్‌పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యభాటి తెలిపారు.

పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్‌లు ఇస్తామంటూ అజయ్‌ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్‌ మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌ ప్రారంభించారు. ఐఎన్‌సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల     కుంభకోణం కాస్తా బిట్‌కాయిన్‌ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్‌ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు       విచారణ వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు