న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలపై సూచనలివ్వండి

8 Jun, 2021 04:05 IST|Sakshi

భాగస్వాములను కోరిన సుప్రీంకోర్టు ఈ–కమిటీ 

పబ్లిక్‌ డొమైన్‌లో ముసాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్‌లపై సుప్రీంకోర్టు ఈ–కమిటీ నమూనా నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ముసాయిదాను పబ్లిక్‌ డొమైన్‌ ఉంచి దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని భాగస్వాములను కోరింది. న్యాయ ప్రక్రియలో పారదర్శకతను, సంబంధిత పక్షాల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా... ఈ సదుపాయాన్ని తెస్తున్నారు. నమూనా నిబంధనలను బాంబే, ఢిల్లీ, మద్రాస్, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో కూడిన కమిటీ రూపొందించింది. ‘‘నమూనా నిబంధనల ముసాయిదా తయారీకి ఉపకమిటీ విస్తృతమైన చర్చలు చేసింది. స్వప్నిల్‌ త్రిపాఠి వర్సెస్‌ సుప్రీంకోర్టు కేసులో 2018లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలు పరిగణనలోకి తీసుకుంది.

న్యాయవాదులు, సాక్షుల గోప్యత, ఇతరత్రా గోప్యతలకు సంబంధించిన అంశాలు, కొన్ని సందర్భాల్లో కేసు సున్నితత్వం కారణంగా ప్రజా ప్రయోజనాన్ని కాపాడడంతోపాటు విచారణపై కేంద్ర, రాష్ట్ర చట్టాల నియంత్రణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది’’ అని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. నమూనా నిబంధనల ముసాయిదా ఈ–కమిటీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఈ–కమిటీ ఛైర్‌ పర్సన్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌.. సలహాలు, సూచనలు ఇవ్వాలని లేఖ రాశారు. ఆర్టికల్‌ 21 ప్రకారం అందరికీ సమన్యాయం హక్కులో భాగంగా ఈ ప్రత్యక్షప్రసారాలు అందుబాటులో ఉండనున్నాయని లేఖలో నొక్కి చెప్పారు. నమూనా నిబందనలపై సూచనలు సలహాలు ఈ నెల 30 లోగా ecommissione ree@aij.gov.inకు పంపాలని సూచించింది.  

ముసాయిదాలో ముఖ్యాంశాలు
కోర్టు హాలులో ఐదు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఒకటి నేరుగా ధర్మాసనం వైపునకు ఉంటుంది. రెండు కెమెరాలు న్యాయవాదుల వైపు ఉంటాయి. నాలుగో కెమెరా అవసరమైన సమయంలో నిందితుడి కోసం వినియోగిస్తారు. ఐదో కెమెరా సాక్షలు వైపు ఉంటుంది.  
ఏ క్షణంలోనైనా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయడానికి ధర్మాసనంలోని న్యాయమూర్తి వద్ద రిమోట్‌ కంట్రోల్‌ ఉంటుంది. ధర్మాసనం అనుమతించిన తర్వాత న్యాయవాదులు, సాక్షులు, నిందితులు లేదా ఇతరత్రా వ్యక్తులు కోర్టులో సంభాషించడానికి మైక్రోఫోన్‌లు అందిస్తారు.   
ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్‌ నిమిత్తం ప్రతి కోర్టు కాంప్లెక్స్‌లోనూ డెడికేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ (డీసీఆర్‌) ఏర్పాటు చేస్తారు.  
రిజిస్ట్రార్‌ (ఐటీ) పర్యవేక్షణలో సాంకేతిక నిపుణులు ప్రత్యక్ష ప్రసారాలను సమన్వయం చేస్తారు. 
వివాహ సంబంధ అంశాలు, బదిలీ పిటిషన్లు, లైంగిక వేధింపుల కేసులు, ఐపీసీ సెక్షన్‌ 376 ప్రొసిడీంగ్స్, మహిళలపై లింగ వివక్ష దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ప్రత్యక్షప్రసారాలు ఉండవు. ప్రధాన న్యాయమూర్తి లేదా ధర్మాసనంలోని న్యాయమూర్తి సూచనల మేరకు ఇతర అంశాల్లోనూ ప్రత్యక్షప్రసారాలను అనుమతించరు. శాంతి భద్రతల ఉల్లంఘనలకు దారితీసే వర్గాల మధ్య విభేదాల కేసులు కూడా ధర్మాసనం అనుమతి ఉంటేనే ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  
విచారణకు ముందే ప్రత్యక్ష ప్రసారంపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పార్టీలకు కోర్టు మాస్టర్‌/రీడర్‌ తెలియజేస్తారు. ఆయా అభ్యంతరాలు సంబంధిత ధర్మాసనానికి పార్టీలు తెలియజేయాల్సి ఉంటుంది.  
ప్రత్యక్ష ప్రసారం చేయని కేసుల రికార్డింగులు  కోర్టు నిర్వహణలో భాగంగా భద్రపరుస్తారు.  
విచారణలకు హాజరయ్యే విజిటర్లు, మీడియా వ్యక్తులు ఆడియో, వీడియో రికార్డు చేయడానికి అనుమతి ఉండదు.  
విచారణ సమయంలో అందరూ న్యాయమూర్తి సూచనలు తప్పకుండా పాటించాలి. 
నిబంధనలు ఉల్లంఘించి వారికి చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్‌తోపాటు కమ్యూనికేషన్‌ పరికరాలను సీజ్‌ చేస్తుంది.  
ట్రాన్స్‌స్రిప్ట్‌లను ఆంగ్లంతోపాటు ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు