Atiq Ahmed-Ashraf Murder: ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?

29 Apr, 2023 05:25 IST|Sakshi

పోలీసుల సమక్షంలోనే అతీక్‌ హత్యకు ఎలా తెగించారు?

నివేదిక ఇవ్వాలని యూపీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్‌ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం.

ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్‌ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్‌ తరఫున హాజరైన సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గీని జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
 
విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి

న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది.

మరిన్ని వార్తలు