బాణాసంచాపై సంపూర్ణ నిషేధం లేదు

2 Nov, 2021 05:25 IST|Sakshi

కలకత్తా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

సాక్షి, న్యూఢిల్లీ: బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండబోదని, గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాళీ పూజ, దీపావళి, క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకలు ఇతరత్రా పండుగల సమయంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. గౌతమ్‌ రాయ్, సుదీప్త భౌమ్నిక్‌ తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.

బాణాసంచా డీలర్ల తరఫు న్యాయవాది సిద్ధార్ధ భట్నాగర్‌ వాదనలు వినిపిస్తూ.. గ్రీన్‌ కాకర్స్‌కు అనుమతిస్తూ 2020లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బాణాసంచాపై పూర్తి నిషేధం లేదని, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి హానికలిగించే వాటినే నిషేధిస్తున్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ధర్మాసనానికి వివరించారు. గ్రీన్‌ కాకర్స్‌పై నిషేధం లేదని, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలు అమలు చేస్తున్నామని భట్నాగర్‌ తెలిపారు. ఇటీవలే నిషేధిత బేరియంతో బాణాసంచా తయారుచేస్తున్న పలు ఉత్పత్తి సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. జులై, అక్టోబరుల్లో వేర్వేరు పిటిషన్ల విచారణ సందర్భంగా బాణాసంచా కాల్చడంపై సంపూర్ణ నిషేధం ఉండదని, గ్రీన్‌కాకర్స్‌ను అనుమతిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెల్సిందే.  

మరిన్ని వార్తలు