దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే

2 Jul, 2022 01:33 IST|Sakshi

‘అనుచిత వ్యాఖ్యల’ ఘటనలకు ఆమే బాధ్యురాలు

న్యాయవాదినని చెప్పుకోవడం సిగ్గుచేటు

‘ఎఫ్‌ఐఆర్‌ల బదిలీ’ పిటిషన్‌పై విచారణకు కోర్టు నిరాకరణ 

దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్‌ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్‌ శర్మ క్షమాపణలు చెప్పాలి
– సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు నోటిపై ఆదుపు లేకపోవడం వల్ల దేశం మొత్తం అగ్ని గోళంగా మారే పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలో జరిగిన పరిణామాలకు ఆమె ఒక్కరే బాధ్యురాలని తేల్చిచెప్పింది. నిరసనలు, హింసాత్మక ఘటనలు, అల్లర్లకు దారితీసేలా మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. చీఫ్‌ పబ్లిసిటీ, రాజకీయ అజెండా లేదా నీచమైన ఎత్తుగడల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై, హైదరాబాద్, శ్రీనగర్‌ తదితర నగరాల్లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఒక్కటిగా కలిపేసి, ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి అయినంత మాత్రాన దేశంలో అశాంతికి కారణమయ్యేలా మాట్లాడే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు మతాలను గౌరవించరని, రెచ్చగొట్టేలా ప్రకటనలు మాత్రమే చేస్తారని ఆక్షేపించింది.

‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్‌ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్య త వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్‌ శర్మ క్షమాపణలు చెప్పాలి’’అని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జేబీ పార్డీవాలాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది. నూపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల చర్చను హోస్ట్‌ చేసిన టీవీ ఛానల్‌పైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘టీవీ చర్చ దేనికి? కేవలం ఒక అజెండాను ప్రమోట్‌ చేయడం కోసమేనా? కోర్టు పరిధిలోని అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు?’’అని నిలదీసింది. అధికారం ఉంది కదా! అని ఏదైనా మాట్లాడొచ్చని ఆమె అనుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. 

బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు 
టీవీ యాంకర్‌ అడిగిన ప్రశ్నలకే నూపుర్‌ సమాధానం ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది మణీందర్‌ సింగ్‌ చెప్పారు. అలాగైతే యాంకర్‌పై నూపుర్‌ శర్మ ఫిర్యాదు చేసి ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. టీవీల్లో వివాదాస్పద ప్రకటనలు చేస్తూ దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించే రాజకీయ ప్రతినిధి స్వేచ్ఛతో జర్నలిస్టు స్వేచ్ఛను పోల్చలేమని వ్యాఖ్యానించింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన టైలర్‌ హత్యను ధర్మాసనం ప్రస్తావించింది. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా నూపుర్‌ శర్మ నోటి దురుసుతో బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టింది.

ఆమెలోని అహంకారం పిటిషన్‌లో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. క్షమాపణలు చెబుతూ నూపుర్‌ రాసిన లేఖను న్యాయవాది మణీందర్‌ సింగ్‌ ప్రస్తావించారు. ధర్మాసనం స్పందిస్తూ.. టీవీ ఛానల్‌కు వెళ్లి ఆమె క్షమాపణలు చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో చాలా జాప్యం జరిగిందని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో షరతులతో వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని సూచించింది.

‘‘నూపుర్‌ కేసులు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేశారు. కానీ, నూపుర్‌పై నమోదైన కేసుల్లో ఆమెను అరెస్టు చేయలేదు. అదే ఆమె పలుకుబడిని సూచిస్తోంది’’అని ధర్మాసనం తెలిపింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటికీ ఆరెస్టు చేయకపోవడంతో బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని వెల్లడించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు తన పిటిషన్‌ను నూపుర్‌ ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. 

బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి .. ప్రతిపక్షాల ఆగ్రహం 
నూపుర్‌ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇందుకు నూపుర్‌శర్మ ఒక్కరే కాదు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కారణమని దుయ్యబట్టారు. సర్కారు తీరు దేశ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలు విరుద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక సిగ్గుతో ఉరేసుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించిందని చెప్పారు. నూపర్‌ శర్మపై చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌నుంచి అలాంటి వారు మరికొందరు పుట్టకొచ్చే ప్రమాదం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

నూపర్‌పై వ్యాఖ్యలను ధర్మాసనం ఉపసంహరించుకోవాలి : సీజేఐకి అజయ్‌ గౌతమ్‌ లెటర్‌ పిటిషన్‌ 
బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మపై సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త అజయ్‌ గౌతమ్‌ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఒక లెటర్‌ పిటిషన్‌ సమర్పించారు. నూపర్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలను వెకేషన్‌ బెంచ్‌ ఉపసహరించుకొనేలా తగిన ఆదేశాలుల లేదా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆమెపై పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం ఉంటుందని అభ్యర్థించారు. తన లెటర్‌ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని విన్నవించారు. నూపర్‌పై వెకేషన్‌ బెంచ్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అవాంఛనీయమని అజయ్‌ గౌతమ్‌ పేర్కొన్నారు.   

చదవండి: ఉదయ్‌పూర్‌ ఘటనను ఖండించిన దీదీ.. నూపుర్‌కు పరోక్ష హెచ్చరికలు

మరిన్ని వార్తలు