మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు సుప్రీం కోర్టులో షాక్‌.. విడుదలపై స్టే

15 Oct, 2022 13:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, మావోయిస్టు లింకుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జీఎన్‌ సాయిబాబాకు భారీ షాక్‌ తగిలింది. ఆయన విడుదలను అడ్డుకుంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషి(సాయిబాబా) మీద నమోదు అయిన అభియోగాలు.. సమాజం, దేశ సమగ్రతకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలని వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే.. శనివారం ముంబై హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌.. ఆయన జీవితఖైదును కొట్టేస్తూ తక్షణమే విడుదల చేయాలంటూ మహారాష్ట్ర హోం శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలపై స్టే విధించాలంటూ మహారాష్ట్ర సర్కార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించింది. దీంతో.. ఈ వ్యవహారంపై మరో అత్యవసర అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించింది.  

ఈ క్రమంలో.. శనివారం మహారాష్ట్ర పిటిషన్‌పై ప్రత్యేక సిట్టింగ్‌ ద్వారా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం.. బాంబే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దోషి విడుదల ఆదేశాలు ఇచ్చే సమయంలో బాంబే హైకోర్టు కొన్ని కీలక విషయాలను విస్మరించిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. వైద్యపరమైన కారణాల దృష్ట్యా గృహనిర్భంధం కోసం సాయిబాబా చేసుకున్న అభ్యర్థనను సైతం.. నేర తీవ్రత దృష్ట్యా తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. సాయిబాబాతో పాటు సహ నిందితులకు నోటీసులు జారీ చేస్తూ డిసెంబర్‌ 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. 

విడుదలపై స్టే ఇస్తూ.. రికార్డుల్లోని సాక్ష్యాలను సవివరంగా విశ్లేషించిన తర్వాత నిందితులు దోషులుగా నిర్ధారించబడినందున.. బాంబే హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేయడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్ 390 కింద అధికారాన్ని వినియోగించుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. 

వీల్ చైర్‌కి పరిమితమైన ఈ మాజీ ప్రొఫెసర్‌.. మావోయిస్టులతో సంబంధాల కేసులో 2014 ఫిబ్రవరిలో అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో జీవిత ఖైదు పడడంతో.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజా సుప్రీం కోర్టు స్టే నేపథ్యంలో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు