హల్ద్వానీ కూల్చివేతలపై సుప్రీం స్టే.. పరిష్కారం అవసరమని వ్యాఖ్య

5 Jan, 2023 14:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరఖాండ్‌లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో నిర్మించిన 4వేల ఇళ్లు, స్కూళ్లు, ప్రార్థనా స్థలాల కూల్చివేతకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. వేలాది మందిని రాత్రికి రాత్రే నిరాశ్రయులను చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ కూల్చివేతలతో ప్రభావితమయ్యే ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం ఆలోచించాలని అభిప్రాయపడింది.

కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘వారు ఉంటున్న ప్రాంతంలో రైల్వేకు చెందిన భూమి, ప్రభుత్వానికి చెందిన భూమిపై ఎంత అనేది స్పష్టత రావాల్సి ఉంది. 50వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించలేరు. ఇక్కడ మానవతా కోణం దాగి ఉంది. వారంతా మనుషులు. ఏదో ఒకటి జరగాలి. వారికి ఏదో విధంగా న్యాయం అందాలి.’అని పేర్కొంది ధర్మాసనం. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేసింది. నిరాశ్రయులవుతున్న వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.   

హల్ద్వానీలోని 29 ఎకరాల భూమిలో ఆక్రమణలను కూల్చివేయాలని డిసెంబర్‌ 20న ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనవరి 9లోగా రైల్వే స్థలంలో ఉన్న బంభుల్‌పురా, గఫూర్‌ బస్తీ, ధోలక్‌ బస్తీ, ఇందిరా నగర్‌ ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. తొలగింపులను ఆపాలని నివాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. క్యాండిల్‌ మార్చ్‌లు, ధర్నాలు చేశారు.

ఇదీ చదవండి: అంజలి సింగ్‌ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు