పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే

9 Jan, 2024 05:53 IST|Sakshi

న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్‌ బాపత్‌ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్‌ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.

‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్‌ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్‌ బాపత్‌ కన్నుమూశారు.

ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్‌ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

>
మరిన్ని వార్తలు