విదేశీ వర్సిటీల్లో చేరేలా... ‘ఉక్రెయిన్‌’ విద్యార్థులకు సాయం

17 Sep, 2022 05:19 IST|Sakshi

పోర్టల్‌ తీసుకురండి: సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇతర విదేశీ యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సాయపడండి. దేశాలవారీగా వర్సిటీల్లో ఖాళీలు, ఫీజులు తదితర పూర్తి వివరాలతో ఓ వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయండి’’ అని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల వైద్య విద్యార్థుల పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

కోర్టు సూచనలపై కేంద్రం వైఖరి తెలపడానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమయం కోరారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన సుమారు 20 వేల మంది విద్యార్థులను యుద్ధ బాధితులుగా పరిగణించాలని వారి తరఫున న్యాయవాది కోరగా విషయాన్ని అంత దూరం తీసుకెళ్లొద్దని ధర్మాసనం సూచించింది. ‘‘వాళ్లు స్వచ్ఛందంగానే ఉక్రెయిన్‌ వెళ్లారని గుర్తుంచుకోవాలి. పైగా వాళ్లు యుద్ధ రంగంలో లేరు కూడా’’ అని జస్టిస్‌ గుప్తా అన్నారు. విద్యార్థులకు సాయం చేయడానికి కేంద్రం పలు చర్యలు చేపట్టిందని మెహతా తెలిపారు.

విద్యార్థులకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలతో భారత్‌ సంబంధాలు పెట్టుకుందన్నారు. విద్యార్థులు అనుకూలమైన విదేశీ వర్సిటీని ఎలా ఎంచుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. లైజనింగ్‌ అధికారిని నియమించామని చెప్పగా ఒక్క అధికారి ఉంటే చాలదని పేర్కొంది. వైద్య విద్య పూర్తి చేయాలనుకుంటే విద్యార్థులు ఓ దారి వెతుక్కోవాల్సిందేనని అభిప్రాయపడింది. విదేశీ వర్సిటీలు ప్రవేశాలు  కల్పించగలిగితే భారత వర్సిటీలకు ఎందుకు సాధ్యం కాదని విద్యార్థుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. దేశీయ వర్సిటీలపై విద్యార్థులకు హక్కు లేదని ధర్మాసనం బదులిచ్చింది. విచారణను సెప్టెంబరు 23కు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు