సాయిబాబాకు చుక్కెదురు

16 Oct, 2022 04:33 IST|Sakshi

ఆయన విడుదల తీర్పును సస్పెండ్‌ చేసిన సుప్రీంకోర్టు

బాంబే హైకోర్టు తీరును తప్పుబట్టిన ధర్మాసనం

గృహనిర్బంధంలో ఉంచాలన్న విజ్ఞప్తికీ తిరస్కరణ

నాగపూర్‌ జైల్లోనే ఉండనున్నసాయిబాబా తదితరులు

సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్‌ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది.

అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్‌ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్‌ సెంట్రల్‌ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు
సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు.

‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్‌ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్‌ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది.

ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్‌ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్‌ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్‌.బసంత్‌ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు.

మెదడు చాలా డేంజరస్‌: ధర్మాసనం
ఈ వాదనలపై సొలిసిటర్‌ జనరల్‌ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్‌ నక్సల్స్‌ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు.

మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్‌ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు