అనుమానాన్నే రుజువు అనలేం: సుప్రీంకోర్టు

22 Feb, 2021 08:06 IST|Sakshi

స్పష్టం చేసిన అత్యున్నత న్యాయ స్థానం

న్యూఢిల్లీ : అనుమానం..అది ఎంత బలమైనదైనప్పటికీ దానిని సాక్ష్యం స్థానంలో అనుమతించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహేతుకమైన కారణంతో దోషిగా నిరూపించలేకపోతే నిందితుడిని నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఒక చర్యకు నిందితులే కారణమని నిరూపించడానికి అందుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని సాక్ష్యాలతోపాటు చూపాలని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఓ హోంగార్డును కరెంటు షాకిచ్చి చంపేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు విముక్తి కల్పిస్తూ ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. 

వనవిహారి మహాపాత్ర, అతని కొడుకు లుజా, మరికొందరితో కలిసి తన భర్త విజయ్‌కుమార్‌కు విషమిచి్చ, కరెంటు షాక్‌తో చంపేశారంటూ గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి, ఆమె భర్త విజయ్‌ కుమార్‌ చందాబాలి పోలీస్‌ ఠాణాలో పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఎలక్ట్రిక్‌ షాక్‌తోనే విజయ్‌కుమార్‌ చనిపోయినట్లు తేలింది. ఇది హత్యే అనేందుకు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. నిందితులకు చెందిన ఒక గదిలో తన భర్త విగతజీవుడిగా పడి ఉన్నాడనీ, ఇది హత్యేనని గీతాంజలి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు బలమిచ్చేలా అంతకుముందు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొంటూ ఒరిస్సా హైకోర్టు నిందితులకు విముక్తి కల్పించింది.  

చదవండి:
లాకర్ల విషయంలో భరోసా ఉండాల్సిందే

మరిన్ని వార్తలు