జాతీయ ప్రణాళిక కావాలి

23 Apr, 2021 06:11 IST|Sakshi

కరోనా పరిస్థితిపై సుప్రీం సుమోటోగా కేసు స్వీకరణ.. విచారణ

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా విజృంభిస్తుండడం, మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రాణవాయువు, అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడం విచారకరమని పేర్కొంది. కరోనా కట్టడి వ్యూహం, ఆక్సిజన్, ఔషధాల సరఫరాపై జాతీయ ప్రణాళిక అవసరమంది. దేశంలో కరోనా కల్లోల పరిస్థితిని సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఇండియాలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సాగుతున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించే జ్యుడీషియల్‌ అధికారం హైకోర్టులకు ఉందా? లేదా? అనేది పరిశీలిస్తామంది. దేశంలో కనీసం 6 హైకోర్టుల్లో కోవిడ్‌ సంబంధిత అంశాలు విచారణలో ఉన్నాయని గుర్తుచేసింది.  సుమోటో విచారణలో తమకు సహకరించేందుకు సీనియర్‌ అడ్వొకేట్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా సుప్రీంకోర్టు ధర్మాసనం నియమించింది.

కోర్టులు వాటి అధికారాలను ఉపయోగించుకుంటున్నాయి
ఇండియాలో కరోనా ప్రస్తుత పరిస్థితి, నియంత్రణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కొన్ని అంశాలపై సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు తెలియజేసింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అహ్మదాబాద్‌ హైకోర్టుల్లో కరోనా పరిస్థితికి సంబంధించిన అంశాలు విచారణలో ఉన్నాయని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయా న్యాయస్థానాలు వాటి పరిధిలోని అధికారాలను ఉపయోగించుకుంటున్నాయని వివరించింది.

ఒక కోర్టు ఒక అంశానికి, మరో కోర్టు మరో అంశానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో గందరగోళం తలెత్తుతోందని వెల్ల డించింది. కాబట్టి నాలుగు కీలక అంశాలు.. ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్‌ విధానం, లాక్‌డౌన్‌ ప్రకటనపై హైకోర్టులకు ఉన్న అధికారంపై దృష్టి పెడతామని స్పష్టం చేసింది. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వానికి నోటీసు ఇస్తున్నామని, వీటిపై జాతీయ ప్రణాళిక తమకు కావాలని వ్యాఖ్యానించింది. జాతీయ ప్రణాళికను హైకోర్టులకు సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌కు ధర్మాసనం సూచించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు