అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు.. మూడవ రోజూ కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అభ్యంతరం

24 Nov, 2022 14:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ నియామకం కాంతి వేగంతో జరిగిందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఈసీ, ఈసీ నియామకాలపై దాఖలైన పిటిషన్‌లపై.. సుప్రీం కోర్టులో విచారణ గురువారం కొనసాగింది. ఈ క్రమంలో వరుసగా మూడవ రోజు విచారణలోనూ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టింది బెంచ్‌. తాజా ఎన్నికల కమిషనర్‌ నియామకంపై ఎందుకు అంత తొందర పడ్డారని ప్రశ్నించింది ధర్మాసనం. 

‘‘మా అభ్యంతరం అంతా ఎంపిక ప్రక్రియపైనే’’ అని ధర్మాసనం.. కేంద్రం తరుపున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ‘‘మే 15వ తేదీ నుంచి ఎన్నికల కమిషనర్‌ స్థానం ఖాళీగానే ఉంది. అప్పటి నుంచి నవంబర్‌ 18వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అసలు ఏం చేసింది. అంతేకాదు ఒకవైపు ఈ వ్యవహారానికి సంబంధించి పిటిషన్‌లు విచారణలో ఉండగా ఆయన్ని ఎలా నియమించార’’ని అభ్యంతరం వ్యక్తం చేసింది. 

నవంబర్‌ 18న అంత హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?. నవంబర్‌ 18వ తేదీనే ఫైల్‌ మూవ్‌ చేసి.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు అని కేంద్రాన్ని సూటిగా నిలదీసింది రాజ్యాంగ ధర్మాసనం. ‘‘న్యాయ మంత్రిత్వ శాఖ నాలుగు పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఆ ఫైల్‌ నవంబర్‌ 18వ తేదీన ముందుకు కదిలింది. అదేరోజు ప్రధాని కూడా పేరును రికమండ్‌ చేశారు. ఈ విషయంలో మాకు మీతో ఎలాంటి సంఘర్షణ అక్కర్లేదు. కానీ, ఎందుకు అంత తొందర అనే విషయాన్ని మాత్రమే మాకు తెలియజేయండి’’ అని కేంద్ర తరపున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్‌ వెంకటరమణిని ప్రశ్నించింది. 

ఎన్నికల సంఘంలో నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థ అవసరమంటూ దాఖలైన పిటిషన్‌లపై.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధఱ్మాసనం వరుసగా మూడు రోజులపాటు విచారణ చేపట్టింది. గురువారం నాటికి వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘంలో సభ్యులకు ఆరేళ్లపాటు పదవిలో ఉండడం లేదంటే 65 ఏళ్ల వయసు పదవీవిరమణ నడుస్తోంది. కానీ, ఈ రెండింటిలో ఏ ఒక్క దానికి సరిపడా అభ్యర్థుల జాబితాను న్యాయశాఖ సిద్ధం చేయలేకపోతోందని అసహనం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. అంతేకాదు.. రాజకీయాలకు దూరంగా, స్వతంత్రంగా ఉండే ఎన్నికల కమిషనర్లు.. దేశానికి ఇప్పుడు అవసరమంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రధాని తప్పు చేసినా చర్యలు తీసుకునేంత పారదర్శకత ఉన్న ఈసీలు దేశానికి కావాలంటూ వ్యాఖ్యానించింది కూడా.

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నవంబర్‌ 21వ తేదీన బాధ్యతలు స్వీకరించారు అరుణ్‌ గోయల్‌. 1985 బ్యాచ్‌  పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఈ మాజీ ఐఏఎస్‌ను ఇంతకు ముందు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత‍్వ శాఖలో  కార్యదర్శిగా పని చేశారు. ఇక వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఆయన్ని.. ఆ వెంటనే ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది కేంద్రం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, మరో ఎన్నికల కమిషనర్‌ ఏసీ పాండేతో పాటు అరుణ్‌ గోయాల్‌ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారు. 

దయచేసి.. నోరు మూస్తారా!  
కేంద్ర ఎన్నికల సంఘం నియామకాల పిటిషన్‌ గురువారం విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఒకవైపు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి మాత్రం సహనం కోల్పోయి.. కాస్త దురుసుగా వాదిస్తూ పోయారు. 

నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించకుండా పరిశీలనలు చేయవద్దంటూ బెంచ్‌ను ఆయన గట్టిగా కోరారు. మరోవైపు వాదనల సమయంలో ఏజీ వాదిస్తుండగా న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించబోతుండగా.. ఏజీ తీవ్రంగా స్పందించారు. ‘‘దయచేసి మీరు కాసేపు నోరు మూయండి’ అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

కాసేపటికి రాజ్యాంగ ధర్మాసనంలోకి జస్టిస్‌ అజయ్‌ రాస్తోగి కలుగుజేసుకుని.. మీరు(ఏజీని ఉద్దేశిస్తూ..) కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి. ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వాలి. మేమంతా సంఘటితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మీ ఇష్టానుసారం వ్యవహరించడం కుదరదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఏజీ స్పందిస్తూ.. కోర్టుకు సమాధానాలు ఇవ్వడంపై కట్టుబడి ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. 

కేంద్రం ఏం చెప్పిందంటే.. ఎన్నికల సంఘం కోసం ముందుగా సీనియర్‌ బ్యూరోక్రట్స్‌తో కూడిన ఓ జాబితాను సిద్ధం చస్తుంది. ఆపై న్యాయశాఖ పరిశీలనకు ఆ జాబితాను పంపుతుంది. అక్కడి నుంచి అది ప్రధాని దగ్గరకు వెళ్తుంది. ఇలా ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సజావుగానే ఉంది. ఇందులోన్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అటార్నీ జనరల్‌ బృందం వాదించింది. 

అయితే కోర్టు మాత్రం వ్యవస్థ తీరు సక్రమంగా లేదని.. పారదర్శకతతో కూడిన వ్యవస్థ అవసరం ఉందని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 - ఎన్నికల కమీషనర్ల నియామకం - ప్రక్రియను ఎలా నిర్దేశించలేదని కోర్టు కేంద్రంపై ధ్వజమెత్తింది. ఈ ఆర్టికల్ ఎన్నికల సంఘం నియామక ప్రక్రియను నిర్వచించడానికి పార్లమెంటు ద్వారా ఒక చట్టాన్ని ఉంచింది. కానీ అది గత 72 ఏళ్లలో జరగలేదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది కూడా.

మరిన్ని వార్తలు