Supreme Court of India: ఇది జాతీయ సంక్షోభం

1 May, 2021 01:59 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

ఆన్‌లైన్‌ విజ్ఞప్తులకు ప్రజలపై కేసులు పెట్టడంపై ఆగ్రహం

కేంద్రమే పూర్తిగా టీకా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్న

కరోనా సంక్షోభం, నిర్వహణపై సుమోటో కేసులో

కేంద్రానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతను సుప్రీంకోర్టు ‘జాతీయ సంక్షోభం’గా అభివర్ణించింది. కరోనా వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కష్ట సమయంలో ప్రజలు  తమ ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయడాన్ని కూడా నేరంగా భావించడం తగదని కేంద్రంతోపాటు రాష్ట్రాల డీజీపీలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.కరోనా సంక్షోభం, నిర్వహణపై సుమోటో కేసును జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా  కేంద్రం పరిగణించాల్సిన ముఖ్యమైన విధాన మార్పులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని, తగిన ఆదేశాలు రూపొందిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

మే 10వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆర్డరు ప్రతిని శనివారం ఉదయం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది. విచారణ సమయంలో కేంద్రాన్ని ధర్మాసనం పలు అంశాలపై ప్రశ్నించింది. వందశాతం వ్యాక్సిన్లు కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీసింది. శ్మశాన వాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా అందిస్తున్నారు? పేటెంటు చట్టాలు వర్తింపజేస్తున్నారా వంటి పలు ప్రశ్నలు ధర్మాసనం వేసింది.

ఢిల్లీ తరఫు న్యాయవాది డార్వా వాదనలు వినిపిస్తూ ఆక్సిజన్‌ కొరతపై మాట్లాడుతుండగా.. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఢిల్లీల్లో కొరత ఉందిగా అని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అఫిడవిట్‌ సమర్పించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అవసరాలు, కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించారు. దీనిపై న్యాయమూర్తులు పలు ప్రశ్నలు సంధించారు.  

సరైన ప్రణాళికే లేదు..!
ఆక్సిజన్‌ ట్యాంకర్లు, సిలిండర్లు ఆసుపత్రులకు చేరడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘అఫిడవిట్‌లో సరైన ప్రణాళిక లేదు. వ్యాక్సిన్‌ అవసరం ఎంత? ఇంటర్‌నెట్‌ సదుపాయం లేనివారు, నిరక్షరాస్యులు ఏ విధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు? వ్యాక్సిన్‌ డోసులను 100 శాతం కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్రం, రాష్ట్రాలకు అమ్మే ధరల్లో వ్యత్యాసం ఎందుకుంది? నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం పాలసీ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి, పంపిణీ వికేంద్రీకరించవచ్చు కదా?

వ్యాక్సిన్‌ తయారీదారులు డోసులను అందించే క్రమంలో ఎలా సమానత్వాన్ని ప్రదర్శించగలరు? 18–45 మధ్య దేశ జనాభా ఎంత అనేది కేంద్రం అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనాలి. వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి వివరాలు చెప్పాలి. ప్రైవేటు కంపెనీలకు కేంద్రం నిధులిచ్చి కేంద్రం చాలా కీలకమైన జోక్యం చేసుకుంది.  వ్యాక్సిన్‌ తయారీదారులు ఈక్విటీని ఎలా నిర్ణయిస్తారు? అని ఆయన నిలదీశారు. ఈ సంక్షోభ సమయంలో కోర్టు జోక్యం అవసరమైన చోట ఆదేశాలు ఇస్తున్నామని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు తెలిపారు.

‘అమెరికా ప్రజలకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తక్కువ ధరకే లభ్యం అవుతోంది. కానీ మనం ఎందుకు ఎక్కువ చెల్లించాలి’ అని జస్టిస్‌ రవీంద్రభట్‌ అన్నారు. ‘టీకా ధరలను కేంద్రం నియంత్రించాలి. కేంద్రం అఫిడవిట్‌లో పది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని చెబుతోంది. లైసెన్సు తీసుకొని ఉత్పత్తి ప్రారంభించొచ్చు కదా? రూ.4,500 కోట్లు వ్యాక్సిన్‌ తయారీ దారులకు ఇచ్చారు. ఈ గ్రాంటు ఏంటో మాకు తెలియలేదు.  ఈ సమయంలో కీలకంగా ఉన్న నర్సులు, వైద్యులు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క,  వసతులు లేక ఎలా మృతి చెందుతున్నారో చూస్తున్నాం’ అని అన్నారు.

సమస్యలు చెప్పుకుంటే కేసులా?
‘సమాచార వ్యాప్తి స్వేచ్ఛగా జరగాలి. ఈ సంక్షోభ సమయంలో అడ్డంకులు సృష్టించరాదు. ప్రజలు తమ ఆవేదనను ఇంటర్నెట్‌ ద్వారా తెలుపుకుంటున్నారు. అయితే, తప్పుడు సమాచారం పెడుతున్నారంటూ వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం తగదు’అంటూ కేంద్రంతోపాటు పోలీస్‌ చీఫ్‌లకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

‘ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, వైద్యుల కొరత, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తమ సమస్యలను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు. తప్పుడు సమాచారం అంటూ అలాంటి పోస్టులపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. ఈ విషయం అన్ని రాష్ట్రాల డీజీపీలకు తెలియజేయండి’ అని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ జాతీయ భద్రతా చట్టం కింద ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొందరిపై చర్యలు చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు