Chief Justice NV Ramana: ట్రిబ్యునల్స్‌ ఖాళీల భర్తీ వ్యవహారంలో కేంద్రంపై ఆగ్రహం

6 Sep, 2021 16:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్‌ ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. భర్తీ విషయంలో అలసత్వం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం వాదనలు జరగ్గా.. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

కేంద్రం ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం లేనట్లు మాకనిపిస్తోంది. మా సహనాన్ని పరీక్షిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఒక వారంలో ట్రిబ్యునల్స్‌ ఖాళీల భర్తీపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సీజే నేతృత్వంలోని న్యాయమూర్తుల బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇక సోలిసిటర్‌ జనరల్‌ మెహతాకి మూడు అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపిన సీజే రమణ.. నియమకాలు చేపట్టడం, ట్రిబ్యునల్స్‌ను మొత్తంగా మూసేయడం, నియమాకాలకు తమకు(సుప్రీం) అవకాశం ఇచ్చి.. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధపడడం ఆప్షన్స్‌ను కేంద్రం ముందు ఉంచారు. 

‘‘మేం అసహనంతో ఉన్నాం. ప్రభుత్వంతో ఇబ్బందికర వాతావరణం మేం కోరుకోవట్లేదు’’ అని సీజే వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా‘‘ప్రభుత్వమూ ఇబ్బందికర పరిస్థితుల్ని కోరుకోవట్లేద’’ని తెలిపారు.  రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్‌ దాఖలు చేసిన ట్రిబ్యునల్‌ ఖాళీల భర్తీ పిటిషన్‌పై.. చీఫ్‌ జస్టీస్‌ రమణ, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్‌,  ఎల్‌ నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపుతోంది. ఈ క్రమంలోనే సోమవారం కేంద్రానికి నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్‌13కి వాయిదా వేసింది.

చదవండి: వరవరరావు బెయిల్‌ మరోసారి పొడిగింపు

మరిన్ని వార్తలు