న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా?

12 Nov, 2022 05:21 IST|Sakshi

కొలీజియం సిఫార్సులు పెండింగా?

కేంద్రం తీరుపై సుప్రీం అసంతృప్తి

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి చేసిన సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సులపైనా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జడ్జీలుగా చేరకుండా నిరుత్సాహపర్చేలా వ్యవహరించవద్దని సూచించింది. పేర్లను చాలాకాలం పెండింగ్‌లో పెట్టడం ద్వారా వారి అంగీకారాన్ని బలవంతంగా వెనక్కి తీసుకొనేలా చేయడం సమంజసం కాదంది.

ఉన్నత న్యాయ స్థానాల్లో ఖాళీలను నిర్దేశిత గడువులోగా భర్తీ చేయడానికి టైమ్‌ఫ్రేమ్‌ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఏఎస్‌ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 11 పేర్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులుగా నియమించాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర్వు జారీ చేసింది.

మరిన్ని వార్తలు