ఈడీ పోలీస్‌ విభాగం కాదు.. అయినా అరెస్టులు సరైనవే: సుప్రీం కోర్టు

27 Jul, 2022 12:41 IST|Sakshi

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ (పీఎంఎల్‌ఏ) ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారాలను సమర్థించింది సుప్రీం కోర్టు. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై బుధవారం కీలక వ్యాఖ్యలే చేసింది. 

పీఎంఎల్‌ఏ చట్టంలోని నిబంధనల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఎంఏ ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అధికారులు కల్పించే.. పీఎంఎల్‌ఏ చట్టంలోని  సెక్షన్లు 5, 8(4), 15,17,19లు చట్టబద్ధమేనని స్పష్టం చేసిన ధర్మాసనం.. బెయిల్‌ విషయంలోనూ సెక్షన్‌ 45 సరైనదేనని నొక్కి చెప్పింది. 

ఈడీ అధికారులు పోలీసులు కాదు.. 
పీఎంఎల్‌ఏలోని పలు సెక్షన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. దర్యాప్తు సంస్థలైన ఈడీ, తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం(ఎస్‌ఎఫ్‌ఐఓ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) వంటివి పోలీసు విభాగాలు కాదని స్పష్టం చేసింది ధర్మాసనం. అయితే విచారణలో భాగంగా ఆయా సంస్థలు నమోదు చేసే వాంగ్మూలాలు ఆధారాలేనని పేర్కొంది.

ఈసీఐఆర్‌ అనేది ఎఫ్‌ఐఆర్‌ కాదు.. 
మనీలాండరింగ్‌ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అరెస్ట్‌కు సంబంధించిన విషయాలను ఈడీ అధికారులు వెల్లడించటం తప్పనిసరి కాదని పేర్కొంది సుప్రీం కోర్టు.

ఫిర్యాదు పత్రం(ఈసీఐఆర్‌)ను నిందితులకు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పీఎంఎల్‌ఏ చట్టం పరిధిలో మనీలాండరింగ్‌ అనేది తీవ్రమైన నేరమని ధర్మాసనం తెలిపింది.

► ‘ఎఫ్‌ఆర్‌కు ఈసీఐఆర్‌ సమానం కాదు. ముందస్తుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవటం ఈడీ విచారణకు అడ్డంకి కాదు.’ అని పేర్కొంది.

► మరోవైపు.. పీఎంఎల్‌ఏ చట్టంలో బెయిల్‌ కోసం జంట నిబంధనలు చట్టబద్ధమేనని, ఏకపక్షం కాదని పేర్కొంది ధర్మాసనం. ఈ నిబంధనలు బెయిల్‌ పొందటంలో కఠినంగా మారినట్లు పిటిషనర్లు పేర్కొనటాన్ని తోసిపుచ్చింది.

► పీఎంఎల్‌ఏ చట్టంలో పలు సవరణలు చేయాలన్న ప్రశ్నలకు బధులుగా.. తమ బెంచ్‌ దీనిపై నిర్ణయం తీసుకోలేదని, ఏడుగురు సభ్యుల బెంచ్‌ విచారిస్తుందని పేర్కొన్నారు జస్టిస్‌ ఖాన్విల్కర్‌. 

► పీఎంఎల్‌ఏ చట్టంలోని నిబంధనలపై వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిని ఒకేసారి విచారిస్తోంది సుప్రీం కోర్టు.

► పోలీసు అధికారులను దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయని, దర్యాప్తులో సీఆర్‌పీసీని అనుసరించాలని పిటిషనర్లు కోరారు.

► ఈసందర్భంగా అరెస్టులు, బెయిల్‌ మంజూరు, ఆస్తుల జప్తు అనేవి కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రోసీజర్‌(సీఆర్‌పీసీ) కిందకు రావని పేర్కొంది.

ఇదీ చదవండి: Eknath Shinde: పొలిటికల్‌ హీట్‌ పెంచిన షిండే ట్వీట్‌.. ఉద్ధవ్‌ థాక్రేతో స్నేహం!


 

మరిన్ని వార్తలు