వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం

18 Feb, 2022 04:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్‌ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్‌హెచ్‌ఎం, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ల ధర్మాసనం విచారించింది.

‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్‌ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్‌ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

అనవసర వ్యాఖ్యలొద్దు
న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఓ టెండర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్‌ ఫ్రిట్జ్‌ వెర్నర్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్‌ పిటిషన్‌ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది.  

మరిన్ని వార్తలు