దాచడానికి ఏమీ లేదు

17 Aug, 2021 04:01 IST|Sakshi

పెగసస్‌.. దేశ భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశం

అనుమానాలు నివృత్తి చేయడానికి తటస్థ నిపుణులతో కమిటీ

సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌

న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్‌ వ్యవహారంలో దాచేయడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి తటస్థులైన ప్రఖ్యాత నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్, శశి కుమార్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

పెగసస్‌పై కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే, సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై మంగళవారం కూడా విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం సంస్థలు అసలు పెగసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నాయో లేదో స్పష్టం చేయాలని, ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్‌ సమర్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. పెగసస్‌ అనేది దేశ భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు. దీన్ని సంచలనాత్మకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పుపట్టారు. అత్యున్నత సాంకేతికతకు సంబంధించిన ఈ అంశాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం ఓ వెబ్‌ పోర్టల్‌లో ప్రచురించిన వార్తల ఆధారంగానే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, వాస్తవానికి పెగసస్‌పై తప్పుడు కథనాలు సృష్టించారని తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

సొంత లాభం కోసం  తప్పుడు ప్రచారం: కేవలం ఊహాగానాలు, అనుమానాలు, బలమైన సాక్ష్యాధారాలు లేని మీడియా కథనాలను, అసంపూర్ణ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పెగసస్‌ స్పైవేర్‌పై కొందరు స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌లో ఇప్పటికే సమాధానం ఇచ్చారని గుర్తుచేసింది. కొందరు సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని విమర్శించింది. అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పెగసస్‌పై మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం దేశంలో 300కు పైగా ఫోన్లపై నిఘా పెట్టిందని, రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులపై కేంద్రం లక్ష్యంగా చేసుకుందంటూ ఇంటర్నేషనల్‌ మీడియా కన్సార్టియం బాంబు పేల్చింది. దీంతో ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. పెగసస్‌పై సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు