పావురాల కోసం ఆకాశం వంక చూడాల్సి వస్తోంది: సుప్రీం

17 Jul, 2021 09:09 IST|Sakshi

సుప్రీంకోర్టులో పావురోపాఖ్యానం! 

న్యూఢిల్లీ: జారీ చేసిన ఉత్తర్వులు అందజేయడంలో జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. డిజిటల్‌ యుగంలో కూడా ఆదేశాలు పంపే పావురాల కోసం ఆకాశం వంక చూడాల్సివస్తోందని వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు అందించేందుకు ఒక సురక్షిత, నమ్మకమైన మార్గాన్ని అమల్లోకి తెచ్చేందుకు యత్నిస్తామని పేర్కొంది. ఇటీవలే 13మంది ఖైదీల విడుదలకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో యూపీ పోలీసులు చేస్తున్న జాప్యంపై వచ్చిన వార్తలను కోర్టు సుమొటోగా స్వీకరించి విచారణ జరిపింది.

ఈ సందర్భంగా... ఆదేశాల అమలు ఆలస్యమవుతుండడంపై చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వం లోని బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం వేగంగా ఆదేశాలు అందించేందుకు అవసరమైన విధానాన్ని ప్రతిపాదించాలని కోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ఇందుకు రెండువారాల గడువు ఇచ్చింది. ఇదే సమయంలో అన్ని జైళ్లలో ఉన్న ఇంటర్‌నెట్‌ సదుపాయంపై వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. లేకుంటే ఇలాంటి ఆదేశాలను వెంటనే అందించలేమని అభిప్రాయపడింది.  

చాలా ఎక్కువ 
ఆగ్రా కోర్టు నుంచి ఖైదీలను విడుదల చేయకపోగా, తమకు కోర్టు ఆదేశాలు అందలేదనడం పరిస్థితిని చూపుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు చాలా ఎక్కువ చేస్తున్నారన్నది. అయితే కొందరు ఖైదీలు తప్పుడు ఆదేశాలను సృష్టిస్తుంటారని, అందువల్ల జైలు అధికారులు కోర్టు వెబ్‌సైట్లో ఆర్డర్లు అప్‌లోడ్‌ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెమతా కోర్టుకు విన్నవించారు. ఈ గందరగోళం లేకుండా చూసేందుకే ఫాస్టర్‌(ఫాస్ట్‌ అండ్‌ సెక్యూర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌)పేరిట అన్ని కోర్టులకు, జైళ్లకు వేగంగా ఆదేశాలు పంపే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవేను కోర్టు అమికస్‌ క్యూరీగా నియమించింది. సొలిసిటర్‌ జనరల్‌ సాయం కూడా తీసుకోవాలని సూచించింది. 

మరిన్ని వార్తలు