కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం

25 Jan, 2023 05:56 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా)కు చెందిన రహస్య పత్రాల్లో కొన్ని భాగాలను బహిర్గతం చేయాలని కొలీజియం తీర్మానించడం తీవ్ర ఆందోళనకర అంశమని అన్నారు. నిఘా విభాగాల సిబ్బంది దేశ హితం కోసం రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తుంటారని, వారి రిపోర్టులను బయటపెడితే భవిష్యత్తులో కార్యాచరణపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పారు.

తద్వారా కొన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఐబీ, ‘రా’ ఇచ్చిన నివేదికల్లోని కొన్ని భాగాలను ప్రజా సమూహంలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే తీర్మానించింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తొలిసారిగా మంగళవారం మాట్లాడారు. కొలీజియం వ్యవహారంపై సరైన సమయంలో పూర్తిస్థాయిలో స్పందిస్తానని, ఇది తగిన సమయం కాదని అన్నారు.

మరిన్ని వార్తలు