సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్‌ ప్రారంభం

25 Nov, 2022 06:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)పోర్టల్‌ను ప్రారంభించింది. ‘‘సుప్రీంకోర్టు ఆర్టీఐ పోర్టల్‌ సిద్ధమైంది. ఒక వేళ ఏమైనా సమస్యలు ఉంటే సరిచేస్తాం’’అని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టీఐ దరఖాస్తుల ఫీజును ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మాస్టర్‌/వీసా క్రెడిట్‌ డెబిట్‌ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లించొచ్చు.

దరఖాస్తు ఖరీదు రూ.10. భారతీయ పౌరులు మాత్రమే దీనిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అపారమైన పని భారంతో సతమతమవుతున్నారని ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. వచ్చే వారంలో 13 బెంచ్‌ల ముందు 525 అంశాలు జాబితా చేయాల్సి ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘‘న్యాయమూర్తులు ఒత్తిడికి లోనవుతున్నారనే విషయాన్ని నమ్మాలి. ప్రతి బెంచ్‌ ముందు సుమారు 45 నుంచి 50 కేసులు ఉంటున్నాయి’’అని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు