Adenovirus: బెంగాల్‌లో అడెనోవైరస్‌ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్‌.. లక్షణాలివే..!

6 Mar, 2023 21:25 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అడెనోవైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ సూచించారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

బెంగాల్‌లో అడెనోవైరస్ బారినపడి ఇప్పటివరకు 19 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 13 మంది చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలున్నాయని మమత చెప్పారు. పిల్లలలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ జ్వరం ఉంటే తక్షణమే హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం వివరాల ప్రకారం అడెనోవైరస్ ఫ్లూ లాంటిదే. ఇది సోకిన చిన్నారులు సాధారణ జ్వరం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల శ్వాసకోశ వ్యవస్థపై ఈవైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. అడెనోవైరస్‌ అన్ని వయస్కుల పిల్లలకు సోకుతుంది. అయితే ఎక్కువగా నవజాత శిశువులు, 10 ఏళ్లుపైబడిన పిల్లలు దీని బారినపడుతున్నారు.

అడెనోవైరస్ లక్షణాలు
జ్వరం
జలుబు
దగ్గు
గొంతులో నొప్పి
కళ్లు గులాబీ రంగులోకి మారడం
న్యుమోనియా
శ్వాసనాళాల వాపు
జీర్ణాశయంలో ఇన్‌ఫెక్షన్‌

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న, శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అడెనోవైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోయాయి. దీంతో అన్ని జిల్లాల వైద్య అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమాకూర్చాలని ఆదేశించింది.
చదవండి: వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక..

మరిన్ని వార్తలు