సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లపైనా ‘నిఘా’

5 Aug, 2021 02:52 IST|Sakshi

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా పాత నంబరుపై కూడా...

న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్‌తో నిఘా పెట్టిన వారి జాబితాలో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు కూడా ఉన్నారని ‘ది వైర్‌’ న్యూస్‌ పోర్టల్‌ బుధవారం వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్జి వాడిన పాత ఫోన్‌ నంబరు కూడా దీంట్లో ఉందని తెలిపింది. రిజిస్ట్రార్లు ఎన్‌కే గాంధీ, టీఐ రాజ్‌పుత్‌లు సుప్రీంకోర్టులోని ‘రిట్‌’ విభాగంలో పనిచేసినపుడు.. 2019లో వీరి ఫోన్లపై నిఘా పెట్టారు. ప్రతి ఏడాది దాదాపు వెయ్యికి పైగా రిట్‌ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవుతాయని, వీటిలో ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవి, రాజకీయంగా సున్నితమైన అంశాలకు సంబంధించినవి కూడా ఉంటాయని వైర్‌ పేర్కొంది. అందువల్లే రిజిస్ట్రార్లపై కన్నేసి ఉంచారని వివరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా వాడిన పాత ఫోన్‌ నంబరు కూడా నిఘా జాబితాలో ఉంది.

సదరు ఫోన్‌ నంబరు 2014లోనే వాడటం ఆపేశానని అరుణ్‌ మిశ్రా తెలిపారు. అయితే 2018 దాకా ఇది ఆయన పేరుపైనే ఉందని వైర్‌ తెలిపింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా పాత ఫోన్‌ నంబరును 2019లో నిఘా జాబితాలో చేర్చారు. ఆయన 2020లో రిటైరయ్యారు. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గి సన్నిహితుడు, ఆయన దగ్గర పనిచేసే జూనియర్‌ ఎం.తంగదురై ఫోన్‌పైనా నిఘా పెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థ తయారుచేసిన పెగసస్‌ స్పైవేర్‌తో విపక్ష నాయకులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులపై (మొత్తం 300 మందిపై) కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని తమ పరిశోధనలో తేలిందని అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం వెల్లడించినప్పటి నుంచి భారత్‌లో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే.

రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్, ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, 40 మంది పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే తాము పెగసస్‌ స్పైవేర్‌ను అమ్ముతామని ఎన్‌ఎస్‌ఓ ప్రకటించింది. చట్ట విరుద్ధంగా ఎవరిపైనా నిఘా పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా... అంటే దానర్థం ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ భారత ప్రభుత్వం వద్ద ఉన్నట్లు, దాన్ని వాడుతున్నట్లు అంగీకరించడమేనని విపక్షాలు అంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జూలై 19 నుంచి పెగసస్‌ అంశంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు