జాతీయ కబడ్డీ పోటీల్లో.. కుప్పకూలిన గ్యాలరీ 

23 Mar, 2021 01:26 IST|Sakshi
గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేస్తున్న దృశ్యం

సూర్యాపేటలో జరిగిన ప్రారంభోత్సవంలో అపశ్రుతి 

150 మందికిపైగా గాయాలు.. 30 మందికి తీవ్రంగా.. 

వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలింపు 

గ్యాలరీ నిర్మాణ లోపంతోనే ప్రమాదమనే అంచనా 

సూర్యాపేట: స్టేడియంలో ఏడు వేల మంది ప్రేక్షకులు.. ఫ్లడ్‌లైట్ల వెలుగులు.. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 30 జట్ల క్రీడాకారులు..  ప్రారంభ వేడుక స్టేజీ మీద నాయకులు, అధికారులు.. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు.. కొద్దినిమిషాల్లో వేడుకలు మొదలవుతాయనగా ఒక్కసారిగా పెద్ద శబ్దం.. వేదిక ఎదురుగా ఉన్న ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. వందల మందికి గాయాలు, క్షతగాత్రుల అరుపులతో భీతావహ వాతావరణం  నెలకొంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి 47వ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల చాంపియన్‌ షిప్‌– 2021 కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ఈ దుర్ఘటన జరిగింది. 150మందికిపైగా గాయపడగా.. 30మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

భారీ స్థాయిలో ఏర్పాట్ల మధ్య.. 
మంత్రి జగదీశ్‌రెడ్డి మాతృమూర్తి జి.సావిత్రమ్మ స్మారకార్థం.. సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న మైదానంలో 47వ జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీల కోసం దీనిని ఇండోర్‌ స్టేడియం తరహాలో మార్చారు. మూడు వైపులా ప్రేక్షకులు, మరోవైపు వీఐపీలకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. సాయంత్రం 6.30 గంటల వరకు మొదలుకాలేదు. అప్పటికే స్టేడియం జనంతో నిండిపోయింది. మూడు గ్యాలరీలను సుమారు 15వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. అందులో వేదికకు ముందు భాగంలో 20 అడుగుల ఎత్తు, 240 ఫీట్ల పొడవుతో ఇనుప గ్యాలరీ ఏర్పాటు చేశారు. దీనిపై సుమారు 2వేల మంది కూర్చున్నారు. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలింది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ భాస్కరన్, పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి.. పోలీసు బస్సు, వాహనాల్లోనే పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. 


సోమవారం సూర్యాపేటలో కబడ్డీ జాతీయ పోటీల ప్రారంభోత్సవంలో కూలిన గ్యాలరీ

ఇనుప రాడ్ల మధ్య చిక్కుకుని.. 
గ్యాలరీ కూలడంతో ఇనుప రాడ్ల మధ్య చిక్కుకొని 150మందికి గాయాలయ్యాయి. వీరిలో 30మందికి కాళ్లు, చేతులు, నడుము విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డవారంతా సూర్యాపేట పట్టణంతోపాటు అనంతారం, పెన్‌పహాడ్, బాలెంల, గుంజలూరు, తాళ్ల ఖమ్మం పహాడ్, కేసారి, కాసరబాద, కుడకుడ, హుజూర్‌నగర్, నల్లగొండ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. 

గ్యాలరీ నిర్మాణలోపంతోనే.. 
ప్రమాదానికి గ్యాలరీ నిర్మాణలోపమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఐదు గ్యాలరీలు (మూడు పెద్దవి, రెండు చిన్నవి) నిర్మించారు. సూర్యాపేటకు చెందిన శివసాయి ఫ్లవర్‌ డెకరేషన్స్‌కు రూ.50 లక్షలతో నిర్మాణ బాధ్యత అప్పగించారు. వెయ్యి మందికిపైగా కూర్చునే గ్యాలరీ నిర్మించాలంటే అన్నీ ఇనుప పిల్లర్లు వాడాలి. భూమిలో రెండు ఫీట్లలోతు గుంతలు తవ్వి పిల్లర్లు పాతి.. వాటిపై గ్యాలరీ నిర్మించాలి. కానీ ఇక్కడ ఇనుప పిల్లర్లకు బదులు కర్రలు వాడారు. అదికూడా లోతుగా గుంతలు తవ్వకుండానే నిలబెట్టారని అంటున్నారు. స్టేజీ కదలకుండా బిగించడంలోనూ నిర్లక్ష్యం జరిగినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల బరువు తట్టుకోలేక గ్యాలరీ కూలినట్టు అంచనా వేస్తున్నారు. 

వైద్య ఖర్చులను భరిస్తా: మంత్రి జగదీశ్‌రెడ్డి 
ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చినవారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని వైద్యుల అసోసియేషన్‌కు సూచించామని.. వారు కోలుకునే వరకు వైద్యఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, అధికారులు ఉన్నారు. 

ప్రమాదంపై గవర్నర్‌ దిగ్బ్రాంతి 
సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వందల మంది గాయపడటం ఆందోళనకరమన్నారు. వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు