ప్రజలకు సుశాంత్‌ సోదరి విజ్ఞప్తి

13 Aug, 2020 11:27 IST|Sakshi

నిజం తప్ప ఇంకేమీ ఆశించడం లేదు: శ్వేతా సింగ్‌

పట్నా: తన సోదరుడి మృతి కేసులో నిష్పాక్షిక విచారణ జరిపించాలని బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కీర్తి గురువారం డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి సుశాంత్‌ మృతి కేసులో సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రతీ  ఒక్కరికి హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం శ్వేతా సింగ్‌ ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. సుశాంత్‌ మరణానికి సంబంధించి నిజాలు తెలుసుకోవడానికే తప్ప మరేదో ఆశించి తాము సీబీఐ విచారణ కోరలేదని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి వాస్తవాలు బయటపడినపుడే సుశాంత్‌ అభిమానులు, శ్రేయోలాభిలాషులు ప్రశాంత జీవితం గడిపే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.(ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం: పవార్‌)

కాగా జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక మలుపుల అనంతరం అతడి ప్రేయసిగా ప్రచారంలో ఉన్న నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై సుశాంత్‌ కుటుంబ సభ్యులు బిహార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియా డబ్బు తీసుకుని సుశాంత్‌ను మోసం చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మృతి కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా బిహార్‌ సర్కారు కేంద్రాన్ని కోరడంతో సానుకూల స్పందన వచ్చింది.(మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారు)

అయితే ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటికే పలుమార్లు ఈడీ ఎదుట హాజరైన రియా చక్రవర్తి సుశాంత్‌ కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేస్తూ.. కొన్ని వాట్సాప్‌ చాట్‌ల స్క్రీన్‌షాట్లు బహిర్గతం చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో శ్వేత ఈ మేరకు వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక తాను దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా సీబీఐ విచారణ ప్రారంభించడం సరికాదంటూ రియా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.(‘సుశాంత్‌ సోదరి నన్ను వేధించారు’)

మరిన్ని వార్తలు