ప్లీజ్‌ సుష్మ‌, జైట్లీని వదిలేయండి? హీరోకు వారసుల విజ్ఞప్తి

2 Apr, 2021 14:35 IST|Sakshi

చెన్నె: బీజేపీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రుల మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్చర్‌ కారణమని సినీ నటుడు, డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడి తట్టుకోలేకనే సుష్మ స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ మృతి చెందారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా వారి వారసులు స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల కోసం తమ తల్లి, తండ్రి పేర్ల ప్రస్తావన సరికాదని ఉదయనిధికి విజ్ఞప్తి చేశారు.

‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్‌ కుమార్తె బన్సూరి స్వరాజ్‌ ట్వీట్‌లో పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్‌ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్‌ చేసింది.

సుష్మ స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్‌పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు వారి మరణం తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించకుండా వారి వారసులు స్పందించడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్‌ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఎయిమ్స్‌ ఇటుక అంటూ ఇటుక చూయించి హాట్‌ టాపిక్‌గా మారాడు. అతడి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు