Monkeypox: మంకీపాక్స్‌ లక్షణాలతో 22 ఏళ్ల యువకుడు మృతి!

31 Jul, 2022 13:08 IST|Sakshi

తిరువనంతపురం: దేశంలో మంకీపాక్స్‌ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు నాలుగు కేసులు నిర్ధారణ కాగా.. తొలిసారి వైరస్‌ సోకిన వ్యక్తి కోలుకున్నట్లు కేరళ వైద్య శాఖ ప్రకటించింది. అయితే.. కొన్ని గంటల్లోనే అదే రాష్ట్రంలో మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలతో ఓ వ‍్యక్తి మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో శనివారం 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే యూఏఈ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. 

వైరస్‌ నిర్ధారణ కోసం యువకుడి నమూనాలను అలప్పుజాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ప్రాంతీయ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు అధికారులు. మృత దేహాన్ని కుటుంబానికి అప‍్పగించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని సూచించారు. ఆ యువకుడికి చికిత్స అందించిన వైద్యులు లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ‘ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి దద్దుర్లు, బొబ్బలు కనిపించలేదు. ఆ తర్వాత కనిపించటం గమనించాం. యూఏఈ నుంచి వచ్చిన వెంటనే ఆసుపత్రిలో చేరాడు.’ అని తెలిపారు. 

మూడు రోజుల క్రితం యూఏఈ నుంచి తిరిగివచ్చాడని, అప్పటి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత దద్దుర్లు రావటంతో మంకీపాక్స్‌గా అనుమానిస్తున్నట్లు చెప్పారు. అయితే.. పరీక్ష ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి ఆందోళన చెందవద్దని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: రెండు వారాల్లోనే కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

మరిన్ని వార్తలు