పనిమనిషిపై చిత్రహింసలు.. సీమ కొడుకే కన్నతల్లి కర్కశాన్ని బయటపెట్టాడు

31 Aug, 2022 20:05 IST|Sakshi

రాంచీ: బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్ర.. తన ఇంట్లో పని చేసిన ఓ గిరిజన మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల పాటు ఆమె ఇంట్లో పని చేసిన సునీత.. వర్ణణాతీతమైన టార్చర్‌ చవిచూసింది. అయితే ఈ ఘటనలో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. సీమ కొడుకుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

సునీతపై జరిగిన దారుణం వెలుగులోకి రావడానికి కారణం.. సీమ కుమారుడేనని తెలుస్తోంది. తన కళ్లెదుట పని మనిషిని కన్నతల్లి చిత్రహింసలకు గురి చేయడాన్ని తట్టుకోలేక సీమ కొడుకు ఆయుష్మాన్‌ బయటపెట్టాడని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారి అయిన వివేక్‌ ఆనంద్‌ బాస్కీ అనే స్నేహితుడిని ఈ విషయంలో ఆయుష్మాన్‌ సాయం కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వివేక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కర్కశాన్ని వెలుగులోకి తెచ్చారన్నది ఆ కథనం సారాంశం. ‘ఈరోజు తాను బతికి ఉండడానికి ఆయుష్మానే కారణమ’ని సునీత కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. తన బాగోతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు కొడుకును సైతం సీమా పాత్ర వదిలిపెట్టలేదు.

కొడుకు ఆరోగ్యం బాగోలేదని చెబుతూ.. అతన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. సునీతకు సాయం చేసే ప్రయత్నం తెలియడంతో కొడుకు ఆయష్మాన్‌ను రాంచీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరో సైక్రియాట్రీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌లో చేర్పించినట్లు సమాచారం. ఆయుష్మాన్‌ అక్కడి సెక్రటేరియెట్‌లో పని చేస్తున్నారు.

మంగళవారం సునీత తనపై సీమా పాత్ర ఎలాంటి వేధింపులకు పాల్పడిందో చెబుతూ ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇనుప రాడ్లతో పళ్లు రాలగొట్టి.. మూత్రాన్ని నేల మీద వేసి నాకించిందని, పని చేసే టైంలో తప్పులు చేస్తే కొట్టడంతో పాటు వాతలు పెట్టేదని సునీత అతికష్టం మీద వెల్లడించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ భార్య, బీజేపీ మహిళా విభాగం నేత అయిన సీమా పాత్ర.. ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయారు. అయితే రాంచీ నుంచిపారిపోతున్న ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి.. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల కస్టడీ విధించింది.

ఇదీ చదవండి: సీమా పాత్ర వేధింపుల ఘటన.. కేటీఆర్‌ స్పందన

మరిన్ని వార్తలు