సువేందుపై ఎఫ్​ఐఆర్​.. దొంగతనం ఆరోపణలు

6 Jun, 2021 08:46 IST|Sakshi

బీజేపీ శాసనసభ పక్ష నేత సువేందు అధికారిపై టీఎంసీ రివెంజ్​ మొదలైందా? తాజా పరిణామాలతో ‘అవుననే’ అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. రానున్న రోజుల్లో అది మరింతగా ఉండబోతుందని వాళ్లు అంచనా వేస్తున్నారు.

కోల్‌కతా :  వెస్ట్ బెంగాల్​ ప్రతిపక్ష నేత, బీజేపీ లీడర్​ సువేందు అధికారిపై ఓ కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డ్‌ సభ్యుడు రత్నదీప్‌ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
కాగా, సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి ఇద్దరూ మే 29న కార్యాలయ గోడౌన్‌లోకి అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకువెళ్లారు అని మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ తృణముల్ మాజీ నేత మమతపై నెగ్గిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తుపాన్​ సమీక్షలో ఈయన కూడా పాల్గొనడంతోనే.. దీదీ ఎగ్గొట్టిందన్న వాదన వినిపించింది కూడా.  

ముఖ్య అనుచరుడీ అరెస్ట్
ఇక సువేందు అధికారి ముఖ్య అనుచరుడు రేఖాల్​ బెరాను కోల్​కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వందల మంది నుంచి డబ్బులు వసూలు చేశారనేది రేఖాల్ పై ప్రధాన ఆరోపణ. ఇది 2019 జులై, సెప్టెంబర్​లో జరిగిందని ఫిర్యాదులో సుజిత్ డే అనే వ్యక్తి పేర్కొన్నాడు. తన నుంచి రెండు లక్షల రూపాయలు రేఖాల్​ తీసుకున్నారని సుజిత్ తెలిపాడు. కాగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ ఫేక్​ జాబ్​ రాకెట్​ స్కాంలో మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

చదవండి: రసవత్తరంగా కోల్డ్​వార్​

మరిన్ని వార్తలు