కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్‌ రాయ్‌ ఫైర్‌

16 Jul, 2021 18:24 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై సువేందు అధికారి కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముకుల్‌ రాయ్‌.. ఆ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన తిరిగి టీఎంసీ గూటికి చేరారు. అయినప్పటికీ ఆయన బీజేపీ శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నారు. 

ఈ నేపథ్యంలో ముకుల్‌ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుంది. ఈ విషయమై ప్రతిపక్ష నేత సువేందు అధికారి బెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీకు ఫిర్యాదు చేయగా, ఇవాళ ఐదు నిమిషాల పాటు విచారణ జరిపించారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ఆయన  ప్రకటించారు. మరోవైపు ముకుల్‌ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు. 

సువేందు చేసిన ఈ ప్రకటనపై మండిపడిన ముకుల్‌ రాయ్‌.. కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ముకుల్‌ రాయ్‌ ప్రస్తుతం బెంగాల్‌ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన కృష్ణానగర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు