దేశంలోనే స్వచ్ఛ నగరంగా మళ్లీ ‘ఇండోర్‌’.. విజయవాడకు నాలుగో స్థానం

1 Oct, 2022 19:01 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన న‌గ‌రంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్‌ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్‌లోని సూర‌త్‌ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా,  ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది.

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డ్స్‌- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్‌, సూరత్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. 

 ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్‌(ఛత్తీస్‌గఢ్‌), కర్హాద్‌(మహారాష్ట్ర)లు ఉన్నాయి. 

► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్‌ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్‌లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌, ఆ తర్వాత కన్నౌజ్‌, గర్‌ముఖ్తేశ్వర్‌ నగరాలు నిలిచాయి. 

► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్‌మెంట్‌ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు.

ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష

మరిన్ని వార్తలు