కాలుష్య రహిత ఢిల్లీనే లక్ష్యం: కేజ్రీవాల్‌

4 Feb, 2021 18:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా దేశ రాజధాని న్యూఢిల్లీ ఉంటోంది. కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘స్విచ్‌ ఢిల్లీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్‌ స్విచ్‌ ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడా కంపెనీలు, స్ధానిక సంక్షేమ సంఘాలు, మార్కెట్‌ సంఘాలు, మాల్స్‌, సినిమా హాళ్ల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లో చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యువత తమ తొలి వాహనంగా ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు.

‘స్విచ్‌ ఢిల్లీ’ కార్యక్రమంతో ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ వాహనాల వాడకంతో కాలుష్యం ఎలా తగ్గుతోందని చెబుతుందని సీఎం అరవింద్‌ తెలిపారు. పాత పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల బదులు ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలని సూచించారు. కాలుష్య రహిత ఢిల్లీ ఏర్పాటుకు సహకరించాలని పిలుపునిచ్చారు. 2020లో ఎలక్ట్రిక్‌ వాహన విధానం తీసుకురావడంతో ఢిల్లీలో 6 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రజలు కొనుగోలు చేశారని సీఎం కేజ్రీవాల్‌ వివరించారు. మరింత ప్రోత్సహించేందుకు ఢిల్లీవ్యాప్తంగా 100 చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం టెండర్లను జారీ చేసిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు