పూల దండలు కాదు.. వాళ్లకు ఉరి తాళ్లే సరి!: స్మితా సబర్వాల్‌ గీత దాటారా??

22 Aug, 2022 11:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ గీత దాటారంటూ చర్చ నడుస్తోంది. గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది జీవిత ఖైదీలకు గుజరాత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి, విడుదల చేయడం దేశవ్యాప్తంగా దూమారం రేపుతోంది. వీరి క్షమాభిక్షకు వ్యతిరేకంగా తెలంగాణ కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ట్విట్టర్‌ వేదికగా మూడు రోజులుగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు.

‘వాళ్లకు ఉరితాళ్లే సరి. పూలదండలతో సన్మానాలు కాదు. వారి క్షమాభిక్షను రద్దు చేసి మా నమ్మకాన్ని పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్న’ అని ఆమె ఆదివారం మరో ట్వీట్‌ చేశారు. గోద్రా జైలు నుంచి విడుదలైన తర్వాత వారిని కొందరు పూలదండలతో సత్కరించి మిఠాయిలు తినిపించడం, ఆ తర్వాత కొన్ని సంస్థలు సన్మానాలు చేయడం పట్ల చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో స్మితా సబర్వాల్‌ సైతం స్పందించారు. 

గీత దాటారంటూ..
‘ఒక మహిళగా, సివిల్‌ సర్వెంట్‌గా ఈ వార్తలు చదువుతున్నప్పుడు నమ్మలేక పోయిన. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్‌ హక్కును హరించి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేము’ అని రెండు రోజుల కింద ఆమె చేసిన ట్వీట్‌ దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. ఆమె ధైర్యాన్ని చాలామంది ప్రశంసించారు. ఐఏఎస్‌ అధికారై ఉండి ఓ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు.

దానికి ఆమె ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల వాక్‌ స్వేచ్ఛను హరించే సర్వీసు నిబంధనలను రద్దు చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ చేసిన మరో ట్వీట్‌ సైతం వైరల్‌గా మారింది. వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదని కొందరు ఐఏఎస్‌ అధికారులు ఆమెకు బాసటగా నిలిచారు. గీత దాటారని మరికొందరు సహచరులు తప్పుబడుతున్నారు. ఇక గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్న వాళ్లు ఆమెపై సోషల్‌ మీడియాలో ప్రతిదాడి చేస్తున్నారు.

ఇదీ చదవండి: అమిత్‌ షా.. ఓ ప్రముఖ క్రికెటర్‌ తండ్రి.. కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

మరిన్ని వార్తలు