రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు.. చరిత్రలో తొలిసారి..

20 Dec, 2022 12:21 IST|Sakshi

లక్నో: ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టాలని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు నోటీసులు పంపారు ఆగ్రా మున్సిపల్ అధికారులు. రూ.1.94 కోట్లు నీటి పన్ను, రూ.1.47లక్షలు ఇంటిపన్ను కట్టాలని  ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)ని అడిగారు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే స్మారక కట్టడమైన తాజ్‌మహల్‌కు.. పన్ను కట్టాలని నోటీసులు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

2021-22, 2022-23కు సంబంధించిన ఈ ట్యాక్స్‌ను 15 రోజుల్లోగా  చెల్లించాలని, లేదంటే ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 

అయితే తాజ్‌మహల్‌కు నోటీసులు పంపిన విషయం తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండే తెలిపారు. పన్ను  లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ఆధారంగా చాలా ప్రాపర్టీలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన స్థలాలు సహా అన్నింటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే చట్టపరంగా పన్నులో రాయితీ ఉంటుందన్నారు.

మరోవైపు తాజ్‌మహల్‌కు పొరపాటుగా నోటీసులు వచ్చి ఉంటాయని ఆర్కియలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. దీన్ని రక్షిత స్మారక కట్టడంగా 1920లోనే ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. తాజ్‌మహల్‌కు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు.
చదవండి: మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్..

మరిన్ని వార్తలు