రిటైర్మెంట్‌లో రికార్డు.. ఒకే రోజు 25 వేల మంది ఇంటిబాట!

1 Jun, 2022 13:25 IST|Sakshi

రాష్ట్రంలో పెరిగిన ఖాళీలు

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మంగళవారం 25 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు అన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020లో దీన్ని 60 ఏళ్లకు పెంచారు. కొత్తగా పోస్టుల భర్తీకి అవకాశం లేని దృష్ట్యా, 58 ఏళ్లు నిండిన వాళ్లకు రెండేళ్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ గత అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు విధుల్లో కొనసాగుతూ వచ్చిన నగరాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్య, వైద్య తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు రెండేళ్ల పాటుగా విధుల్లో కొనసాగారు. వీరందరి పదవీ కాలం మే 31(మంగళవారం)తో ముగిసింది. దీంతో ఈ ఒకే రోజున రికార్డు స్థాయిలో 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఇక, వీరికి పదవీ విరమణ నిధి కేటాయింపు కోసం రూ. ఐదు వేల కోట్ల మేరకు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో లక్షా 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా పదవీ విరమణతో ఆ సంఖ్య లక్షా 75 వేలకు చేరినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.  

టీఎన్‌పీఎస్సీ ద్వారా భర్తీ  
కండెక్టర్లు, డ్రైవర్లు తదితర పోస్టులను ఇది వరకు రవాణాశాఖ భర్తీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో టీఎన్‌పీఎస్సీ ద్వారా భర్తీకి తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు టీఎన్‌పీఎస్సీ మంగళవారం ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. అయితే, కండెక్టర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది నియమకానికి టీఎన్‌పీఎస్సీకి అవకాశాలు ఉన్నా, డ్రైవర్ల ఎంపిక మాత్రం కొంత ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. డ్రైవర్ల ఎంపిక రాత పరీక్ష, ఇతర అర్హతల మీద కన్నా, అనుభవం ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ దృష్ట్యా, డ్రైవర్ల ఎంపికపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని టీఎన్‌పీఎస్సీ కోరినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు