బతికే ఉన్న అన్నను ఫ్రీజర్‌లో పెట్టాడు...!

15 Oct, 2020 18:02 IST|Sakshi

మానవత్వం మరిచిన సోదరుడు

12 గంటలు ఫ్రీజర్‌లో వృద్ధుడు  

చెన్నై: కొన్ని సార్లు మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు చూస్తే.. త్వరగా యుగాంతం వస్తే బాగుండు అనిపిస్తుంది. అంతటి దారుణాల మధ్య యాంత్రికంగా బతికేస్తున్నాం. ఇక వృద్ధుల పట్ల జరిగే దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు కుటుంబం కోసం శ్రమిస్తారు. వృద్ధాప్యంలో తన వారికి భారమవుతారు. ఈసడింపులు, ఛీత్కారాలు భరిస్తూ.. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం అని ఆ పండుటాకులు.. ఎప్పుడు పోతార్రా బాబు అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తోన్న రోజులివి. అందరు ఇలానే ఉన్నారని కాదు. కానీ ఇలాంటి వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడి చావు కోసం ఎదురు చూస్తూ.. కుటుంబ సభ్యులు ప్రాణం ఉండగానే అతడిని శవాలను ఉంచే ఫ్రీజర్‌లో పెట్టి ఎప్పుడు కన్ను మూస్తాడా అని ఎదురు చూస్తున్న ఘటన సేలంలో చోటు చేసుకుంది. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ]

వివరాల్లోకి వెళితే...సేలం కందపట్టి హౌసింగ్‌ బోర్డుకు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి  బాలసుబ్రమణ్య కుమార్‌ (70)కు పిల్లలు లేరు. గత ఏడాది భార్య  ఉషా కూడా మరణించింది. దీంతో తన సోదరుడు శరవణన్, బంధువులు జయశ్రీ, గీతలతో కలిసి హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉన్నారు. గత నెల బాలసుబ్రమణ్య కుమార్‌ అనారోగ్యం బారిన పడటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆయన పరిస్థితి విషమించినట్టేనని, ఇక బతకడం కష్టం అని వైద్యులు తేల్చారు. దీంతో మంగళవారం ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. కాసేపటికి బాలసుబ్రమణ్య కుమార్‌  కోమాలోకి వెళ్లినట్టుగా పరిస్థితి మారింది. దీంతో ఇక, అన్నయ్య మరణించినట్టేనని భావించిన తమ్ముడు శరవణన్, అంత్యక్రియల ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాడు. (చదవండి: వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన)

ముందుగానే ఏర్పాట్లు.....
ముందుగా ఫ్రీజర్‌ బాక్స్‌ను ఇంటికి తెప్పించాడు. అందులో బతికే ఉన్న సోదరుడిని పడుకోబెట్టాడు. కాళ్లు చేతులు, కట్టి మృతదేహంలా ఆ బాక్స్‌లో పెట్టేశాడు. బాలసుబ్రమణ్య కుమార్‌ శరీరం చచ్చుబడ్డా, గుండె మాత్రం కొట్టుకుంటుండటంతో, ఆ శబ్దం ఎప్పుడు ఆగుతుందో అని రాత్రంతా ఎదురు చూశాడు. అయితే, బుధవారం ఉదయాన్నే  ఆ ఇంటికి ఫ్రీజర్‌ బాక్స్‌ అద్దెకు ఇచ్చిన వ్యక్తి వచ్చాడు. ఈ సమయంలో బాలసుబ్రమణ్య కుమార్‌ శరీరంలో చలనం కనిపించడంతో, కళ్లు తెరచుకుని ఊపిరీ పీల్చలేని స్థితిలో ఉండటాన్ని చూసి  ఆందోళన చెందాడు. శరవణన్‌ను హెచ్చరించాడు.  ఆయన పట్టించుకోక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అక్కడకు చేరుకున్న పోలీసులు ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యను బయటకు తీశారు. అంబులెన్స్‌లో  ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. శరశణన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులు విస్తుపోవాల్సి వచ్చింది.  తన సోదరుడు చనిపోవడం ఖాయం అని వైద్యులు చెప్పేశారని, అందుకే ముందుగానే తాను ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందని, తమకు  సాయంగా ఎవ్వరూ లేరని , అందుకే అన్ని ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నట్టు తెలిపాడు.

ఈ సందర్భంగా దీవలింగం మాట్లాడుతూ.. "ఆ వ్యక్తిని రాత్రంతా లోపల ఉంచారు. ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ భయపడి నన్ను అప్రమత్తం చేశాడు. దీని గురించి అతడి కుటుంబ సభ్యులు ‘అతను చనిపోయాడు కానీ ఆత్మ ఇంకా విడిచిపెట్టలేదు అందుకే మేము వేచి ఉన్నాము' అని చెప్పారు" అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

మరిన్ని వార్తలు