-

ఢిల్లీలో ‘రెండాకుల’ పంచాయితీ

25 Jun, 2022 19:07 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు ముదిరింది. ఆ పార్టీలో నెలకొన్న రాజకీయ పంచాయితీ హస్తినకు చేరుకుంది. ఎడపాడి ఎత్తుగడలను అడ్డుకునేలా ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఓపీఎస్‌ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఓ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌గా ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న ధ్వంధ నాయకత్వానికి తెరదించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇదే అదనుగా ఏక నాయకత్వం నినాదాన్ని ఎడపాడి పళనిస్వామి తెరపైకి తెచ్చారు.

ఈ వ్యవహారాన్ని పన్నీర్‌సెల్వం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సుమారు పదిరోజులకు పైగా సాగిన ఈ ఆధిపత్యపోరు గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విశ్వరూపం దాల్చింది. మెజారిటీ కార్యవర్గం ఎడపాడికి మద్దతుగా నిలవడంతో పన్నీర్‌ వేసిన పాచికలు పారలేదు. తనకు అనుకూలంగా ఓపీఎస్‌ రూపొందించిన 23 తీర్మానాలు ఆమోదం పొందక వీగిపోయాయి. ప్రిసీడియం శాశ్వత చైర్మన్‌గా తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ ఎంపికైనట్లు గురువారం నాటి సమావేశంలో ఈపీఎస్‌ ప్రకటించారు. జూలై 11 వ తేదీన మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించేలా ఈపీఎస్‌ వర్గానికి చెందిన మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన విజ్ఞప్తిని ప్రిసీడియం చైర్మన్‌ గురువారం నాటి సమావేశంలో అనుమతించారు. ఏక నాయకత్వంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీవీ షణ్ముగం అదే వేదికపై ప్రకటించారు. 

రాజధానికి చేరుకున్న ఓపీఎస్‌ 
సర్వసభ్య సమావేశం మొత్తం ఈపీఎస్‌కు అనుకూలంగా మారడంతో కినుక వహించిన పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో కలిసి వాకౌట్‌ చేశారు. అందరూ కలిసి గురువారం రాత్రే ఢిల్లీ విమానం ఎక్కేశారు. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి పార్టీలో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతేగాక జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరుపకుండా స్టే విధించాలని కోరుతూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు ఓపీఎస్‌ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. కన్వీనర్‌గా ఉన్న తన అనుమతి లేకుండా ప్రిసీడియం చైర్మన్‌ను ఎన్నుకున్నారని, ప్రధాన కార్యదర్శి పదవి లేనందున కన్వీనర్, కో కన్వీనర్‌ పదవులను ఏర్పాటు చేసుకున్నామని అందులో వివరించారు. ప్రధాన కార్యదర్శి పదవిని చట్టవిరుద్ధంగా పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఈసీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

రాజీకి ససేమిరా 
వివాదాలను పక్కనపెట్టి సామరస్యం దిశగా ముందుకు సాగేలా ఓపీఎస్‌ వర్గం చేసిన ప్రతిపాదనను ఈపీఎస్‌ వర్గం తోసిపుచ్చింది. ఏక నాయకత్వాన్నే కోరుతున్నామని మరోమారు స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి పావులు కదిపేలా పన్నీర్‌సెల్వం చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టేందుకు ఎడపాడి పళనిస్వామి చెన్నైలో చట్ట నిపుణులతో శుక్రవారం చర్చలు జరిపారు. ఎత్తుకు పైఎత్తువేసి పన్నీర్‌ను పడగొట్టాలని మద్దతుదారులతో సమావేశమయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ల పదవీకాలం ముగిసినందున ప్రిసీడియం చైర్మన్‌ మాటే పార్టీలో చెల్లుబాటు అవుతుందని సీవీ షణ్ముగం మీడియాతో శుక్రవారం అన్నారు. పన్నీర్‌సెల్వం ప్రస్తుతం పార్టీ కన్వీనర్‌ కాదు, కోశాధికారి మాత్రమేనని వ్యాఖ్యానించారు. జనరల్‌బాడీ సభ్యుల నుంచి ఐదుశాతం హాజరీ ఉంటే సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఎడపాడి అనుమతిస్తే ఓపీఎస్‌ను కలిసి చర్చలు జరుపుతానని ప్రిసీడియం చైర్మన్‌ చెప్పారు.  

చదవండి: EPS - OPS Clash: పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు విసిరిన ఈపీఎస్‌ వర్గీయులు

మరిన్ని వార్తలు