కోవిడ్‌ వ్యాక్సిన్‌.. సెకెండ్‌లో ఫస్ట్‌ 

22 Jul, 2021 08:17 IST|Sakshi

రెండో డోసు సాధనలో చెన్నై నంబర్‌ వన్‌ 

దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో సర్వేతో నిర్ధారణ 

చెన్నైలో మళ్లీ వినియోగంలోకి వ్యాక్సిన్‌ 

సాక్షి ప్రతినిధి, చెన్నై: రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసిన దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో చెన్నై ప్రథమ స్థానంలో నిలిచినట్లు చెన్నై కార్పొరేషన్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇటీవల జరిపిన ఒక సర్వేలో ఈ విషయం నిర్ధారణైనట్లు పేర్కొంది.  దేశంలో కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్, స్పుట్నిక్‌ వ్యాక్సిన్‌ వినియోగంలో ఉంది. స్పుట్నిక్‌ వ్యాక్సిన్‌ను కొన్ని ప్రయివేటు సంస్థల వారు మాత్రమే వినియోగిస్తున్నారు. తమిళనాడుకు సంబంధించి ఒక కోటి 83 లక్షలా 56 వేల 631 మందికిపైగా వ్యాక్సిన్‌ వేశారు. అయితే కేంద్రం నుంచి తగిన మోతాదులో వ్యాక్సిన్‌ అందకపోవడంతో తరచూ ప్రతిష్టంభన నెలకొంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5వేలకుపైగా ఉండిన వ్యాక్సిన్‌ శిబిరాలు ప్రస్తుతం మూడువేలకు చేరుకున్నాయి.

అలాగే చెన్నైలో 440కు పైగా సేవలందిస్తుండిన శిబిరాలు 64కు పడిపోయాయి. వ్యాక్సిన్‌ వేసుకోవడంపై తొలిరోజుల్లో భయాందోళనలు నెలకొన్నా ప్రస్తుతం ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. సగటున రోజుకు 1.50 లక్షల మంది వరకు వ్యాక్సిన్‌ వేసుకుంటున్నారు. అయితే మొదటి డోసు వేసుకున్నపుడు జ్వరం, తలనొప్పులు వంటి అనారోగ్యం తలెత్తడంతో వీరిలో కొందరు రెండో డోసు వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. రెండో డోసు గడువుకు చేరిన వారి కోసం చెన్నై కార్పొరేషన్‌ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ ఈ ఐదు నగరాల్లో రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయడంపై ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో రెండో డోసు వేయడంలో చెన్నై నగరం 11 శాతం, బెంగళూరు 10 శాతం, ఢిల్లీ, ముంబయి నగరాలు 7 శాతం, హైదరాబాద్‌ 5 శాతం సాధించినట్లు తేలింది.  

చెన్నైలో మళ్లీ వ్యాక్సిన్‌ ప్రారంభం: 
కాగా, రెండురోజుల విరామం తరువాత చెన్నైలో బుధవారం మళ్లీ వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేశారు. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని 45 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఇటీవలి కాలంలో ఈనెల 19వ తేదీ వరకు 28,65, 576 మందికి వ్యాక్సిన్‌ వేసారు. వ్యాక్సిన్‌ నిల్వలు లేకపోవడంతో సోమ, మంగళవారాల్లో వ్యాక్సిన్‌ వేయడం ఆగిపోయింది. మంగళవారం రాత్రి 5 లక్షల వ్యాక్సిన్‌ లోడు రావడంతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సిన్‌ వేస్తామని కార్పొరేషన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలు ఉదయం 6 గంటల నుంచే శిబిరాల వద్ద క్యూకట్టి 45 ప్రత్యేక శిబిరాల ద్వారా సుమారు 9 వేల మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు. చెన్నైకి బుధవారం రాత్రి మరో 5.5 లక్షల కోవిషీల్డ్‌ డోసులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.     
 

మరిన్ని వార్తలు