తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు

12 Nov, 2022 08:40 IST|Sakshi

సాక్షి, చెన్నై: కుండపోత వర్షాలతో తమిళనాడు ఆగం అవుతోంది. రాజధాని చెన్నైలో కొన్నిప్రాంతాల్లో, కంచీపురం, చెంగళ్‌పేట, తిరువల్లూరు, మయిలడుతురై, విల్లుపురం జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం మొదలై.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలోని కొన్ని రోడ్లు.. చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో శనివారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

చెన్నైలో గత 24 గంటల్లో.. సగటున 64.5 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు.  ఇప్పటికే సహాయక శిబిరాల ఏర్పాటుతో పాటు రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మొత్తం 19 జిల్లాలకు అతిభారీ వర్షాల సూచన నెలకొంది. ఇదిలా ఉంటే.. చెన్నైలో పలు ప్రాంతాలు జలమయం అయినట్లు తెలుస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం స్టాలిన్‌ పర్యటించనున్నట్లు సమాచారం. ఇంకోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో.. తీర ప్రాంతాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: రాజీవ్‌ హంతకుల విడుదల.. సుప్రీం సంచలన ఆదేశాలు

మరిన్ని వార్తలు