MK Stalin: అనాథ బాలలకు రూ.5 లక్షల సాయం

30 May, 2021 09:27 IST|Sakshi

ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

చెన్నై/గువాహటి: అనాథ బాలలకు, కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. వారి పేరిట ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామన్నారు. దానిపై వడ్డీని నెలనెలా వారికి 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అందేలా చూస్తామన్నారు. దీంతోపాటు, గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకు వారి చదువుకయ్యే అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

ఇటువంటి చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏ దిక్కూలేని బాలలకు ప్రభుత్వ వసతి గృహాలు, ఇతర సంస్థల్లో ఆశ్రయం కల్పించనున్నట్లు వెల్లడించారు. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన చిన్నారులకు కూడా రూ.3 లక్షలు తక్షణ సాయంగా అందజేస్తామని సీఎం స్టాలిన్‌ తెలిపారు. బంధువులు లేదా సంరక్షకుల వద్ద పెరిగే చిన్నారులకు నెలకు రూ.3 వేలను 18 ఏళ్లు వచ్చేదాకా అందజేస్తామన్నారు.

నెలకు రూ.3,500 ఇస్తామన్న అస్సాం సర్కార్‌
కోవిడ్‌తో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా మారిన బాలల సంరక్షకులకు నెలకు రూ.3,500 చొప్పున అందజేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఇందులో కేంద్రం రూ.2 వేలు భరిస్తుందన్నారు. ఈ మొత్తం బాధిత బాలల విద్య, నైపుణ్యం మెరుగుదలకు వినియోగిస్తామన్నారు. పదేళ్ల లోపు, అయిన వారు ఎవరూ లేని బాలలను మాత్రం ప్రభుత్వ ఖర్చుతో ఆశ్రమ పాఠశాలలు, సంస్థల్లో ఆశ్రయం కల్పిస్తామన్నారు. వీరికి వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి, జీవనోపాధి లభించేలా చూస్తామన్నారు.

సరైన పోషణ, రక్షణ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలికలైతే వివాహ వయస్సు వచ్చాక అరుంధతి పథకం కింద 10 గ్రాముల బంగారం, రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. పాఠశాల, లేదా కళాశాలల్లో చదువుకునే వారికి ల్యాప్‌టాప్‌ కూడా అందిస్తామన్నారు. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చే ‘ముఖ్యమంత్రి శిశు సేవా పథకం’ కింద ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

(చదవండి: దేశంలో 37% తగ్గిన వ్యాక్సినేషన్‌)

మరిన్ని వార్తలు