విద్యార్థులకు బంపరాఫర్‌.. 2జీబీ డేటా ఫ్రీ

11 Jan, 2021 10:29 IST|Sakshi

సాక్షి, చెన్నై : విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ ప్రకటన చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గత మార్చి 21వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. కరోనా నానాటికీ అధికమవుతున్నందున విద్యాసంస్థలను ప్రారంభించడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వార్షిక పరీక్షలు రద్దు చేసి ఆల్‌ పాస్‌ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను యూజీసీ, ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించాయి. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వర్సిటీల కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్‌ విడుదలైంది. దీంతో చెన్నై వర్సిటీ పదిరోజులుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉత్తర్వులు జారీ చేసి పదినెలలకు పైగా కావస్తున్న స్థితిలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పీజీ కళాశాల విద్యార్థులకు డిసెంబర్‌ రెండవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. యూజీ విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇలావుండగా కొత్త  కరోనా వైరస్‌ వ్యాప్తితో కళాశాలలు ప్రారంభించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్‌లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు. కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున  ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది.  దీంతో ఆన్‌లైన్‌ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి ఉత్తర్వులిచ్చారు.

విద్యావేత్తల అసంతృప్తి : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా ప్రకటన చేయడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పలు మొబైల్‌ సంస్థలు 1.5 జీబీ డేటా ఉచితంగా అందిస్తున్నాయని, వీటిని ఉపయోగించలేని స్థితిలో పలు నెట్‌వర్క్‌లు లభించడం లేదని ఫిర్యాదులందుతున్నట్లు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు